మాయమాటలతో మభ్యపెట్టి అత్యాచారం.. షాక్‌కు గురై గుండెపోటు

Tribal Girl Molested By Young Man In Mahabubabad District - Sakshi

వంచించి.. అత్యాచారం

గిరిజన బాలికపై యువకుడి అఘాయిత్యం

షాక్‌కుగురై గుండెపోటుతో మృతి!

ఏమీ తెలియనట్లు మిత్రులకు ఫోన్‌ 

వారి సాయంతోఆస్పత్రికి తరలింపు 

పోలీసుల అదుపులో నిందితులు

మరిపెడ రూరల్‌: ఓ యువకుడు మాయమాటలతో మభ్యపెట్టి గిరిజన బాలికపై అత్యాచారం చేశాడు. అయితే.. ఊహించని షాక్‌కు గురైన ఆమె గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన శనివారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం సీతారాం తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మోడు లక్‌పతి, వసంత దంపతుల కుమార్తె ఉష (17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి లక్‌పతికి మహబూబాబాద్‌ జాతీయ రహదారిపై పెట్రోల్‌ బంక్‌ వద్ద కిరాణ దుకాణం ఉంది. ఇటీవల ఆయన కాలు విరగడంతో షాపులో ఉన్న సరుకులు తీసుకురావాలని శనివారం కూతురు ఉషను పంపించాడు. అదే సమయంలో ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్‌ రాజేశ్‌ దుకాణం వద్దకు వచ్చాడు.

ఉషకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన స్నేహితుడు, సీతారాం తండాకు చెందిన శ్రీనుకు ఫోన్‌ చేసి నీళ్లు తీసుకురావాలని సూచించాడు. అతను తన స్నేహితుడైన శంకర్‌తో కలసి వచ్చే సరికి ఉష స్పృహ తప్పి ఉంది. దీంతో ముగ్గురు కలసి ఆమెను పురుషోత్తమాయగూడెంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. అతను మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. ఈలోపు విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వెంటనే మహబూబాబాద్‌ ఆస్పత్రికి తరలించగా.. ఉష అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు  
అమాయకురాలైన తమ బిడ్డకు మాయమాటలు చెప్పి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఉష తల్లిదండ్రులు లక్‌పతి, వసంత బోరున విలపించారు. ఈ ఘటనలో రాజేశ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని వారు ఆరోపించారు. కాగా, ఉషపై రాజేశ్‌ ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడ్డాడా..?, మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో ఉష మృతదేహాన్ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. అనంతరం తొర్రూరు డీఎస్పీ వెంకటరమణతో కలసి ఘటనా స్థలం వద్ద విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాజేశ్, ఉష ఇద్దరూ గుట్టల వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. నిందితుడిపై పోక్సోతో పాటు 376, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ గౌతం కూడామృతురాలి బంధువులను ఓదార్చారు. అయితే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, పోలీసులు నచ్చచెప్పి పంపించారు. కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  
 

విచారణ జరపండి.. ఎస్పీకి మహిళా కమిషన్‌ ఆదేశం 
సాక్షి, హైదరాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా మర్రిపెడ మండలం సీతారాం తండాకు చెందిన  బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితాలక్ష్మారెడ్డి ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top