కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య 

Throwing The Son Father Commits Suicide - Sakshi

సొంత వ్యవసాయక్షేత్రంలో పురుగుల మందు తాగిన రాంరెడ్డి 

కొడుకు ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు 

కుటుంబ కలహాలే కారణమా? 

కొద్దిరోజులు మానసిక చికిత్స పొందిన రాంరెడ్డి 

సూర్యాపేట జిల్లాలో ఘటన  

ఆత్మకూర్‌ (ఎస్‌): బిడ్డల్ని చేతులు పట్టుకుని నడిపించాల్సి తల్లిదండ్రులే తమకు సమస్య ఎదురవగానే వారితో పాటు బిడ్డల్ని కూడా బలిపెట్టేందుకు వెనుకాడటం లేదు. కుటుంబ కలహాలతో ఆరేళ్ల కొడుకుని బావిలో పడేసి...ఆపై తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడో తండ్రి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలం ఏనుబాములలో గురువారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏనుబాముల గ్రామానికి చెందిన సురుకంటి రాంరెడ్డి (45), పద్మ దంపతులకు ప్రేమ్‌ చరణ్‌రెడ్డి, తనూజ్‌రెడ్డి (6) కొడుకులు. రాంరెడ్డి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో ఉంటున్నారు. గురువారం స్వగ్రామం ఏనుబాములకు వెళ్తానంటూ చిన్న కొడుకు తనూజ్‌రెడ్డిని బైక్‌పై తీసుకెళ్లాడు.

అనంతరం కొడుకు తినేందుకు దుకాణం వద్ద తినుబండారాలు కొని తన వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న బావిలో కుమారుడిని పడేసి..కొద్దిదూరంలోని ఓ చెట్టుకింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వచ్చిన పశువులు కాపరులు రాంరెడ్డిని చూసి వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించగా..వారు వచ్చి బాలుడి కోసం వెదికారు. అయితే తన కొడుకును పాతబావిలో పడేసినట్లు రాసి ఉంచిన లేఖ రాంరెడ్డి జేబులో లభించడంతో వెంటనే అక్కడకు వెళ్లి చూడగా బావిలో బాలుడి చెప్పులు తేలుతూ కన్పించాయి. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలికి వచ్చి బాలుడి కోసం బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో నీళ్లు నిండుగా ఉండటంతో సమీపంలోని మోటార్లను సాయంతో నీటిని తోడినా బాలుడి ఆచూకీ కనిపించలేదు.  

కుటుంబ కలహాలే కారణమా? 
రాంరెడ్డి కుటుంబంలో ఏడాదిగా కుటుంబ కలహాలు జరుగుతుండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, గత లాక్‌డౌన్‌ నుంచి రాంరెడ్డి ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేయడం, ఈ క్రమంలో తోచిన వారికి సాయం అందిస్తూ రూ.లక్షల అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కుటుంబసభ్యులతో రాంరెడ్డికి ఇంట్లో గొడవలు ఏడాదిగా జరుగుతున్నాయి. ఇతని వ్యవహారం చూసిన కుటుంబ సభ్యులు చివరకు హైదరాబాద్‌లోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం కొంత భూమిని అమ్మి రాంరెడ్డి అప్పులు తీర్చినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఇలా కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top