పెండింగ్‌ కేసులు పూర్తి చేయండి

Telangana DGP Mahender Reddy Said Complete Pending Cases In State - Sakshi

విచారణ పేరుతో కాలయాపన చేయొద్దు: డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. విచారణ పేరుతో నెలల కొద్ది కేసులను పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, సీఐడీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న పెండింగ్‌ కేసుల విచారణ పూర్తి చేసేందుకు జిల్లా ఎస్పీలు, డీఎస్పీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రతివారం యూఐ (అండర్‌ ఇన్వెస్టిగేషన్‌) మేళా నిర్వహించాలని సూచించారు. నేరస్తుల శిక్షా శాతం పెరిగితే నేరాలు చేయాలంటే నిందితులు భయపడతారని, దీంతో నేర నియంత్రణ సులువు అవుతుందని పేర్కొన్నారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడంతో సైబర్‌ నేరాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ యూనిట్లలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది మరింత మెళకువలు నేర్చుకుని దర్యాప్తు చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారంలో పోలీసు శాఖ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తోందని, అందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని డీజీపీ సూచించారు. ఎక్సైజ్, పోలీస్‌ సంయుక్తంగా సోదాలు, దాడులు నిర్వహించి గంజాయి రవాణాకు చెక్‌ పెట్టాలని ఆదేశించారు.

సర్వీస్‌ రూల్స్‌పై డీజీపీ సమీక్ష
పోలీసు శాఖలోని సర్వీస్‌ రూల్స్‌ను సమీక్షించుకోవడంతో పాటు ఏళ్లుగా వేధిస్తున్న కొన్ని రూల్స్‌ను మార్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటైంది. రిటైర్డ్‌ డీఐజీ వై.గంగాధర్‌ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో ఉద్యోగ సంబంధిత సర్వీసుపై పట్టున్న రిటైర్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులతో పాటు సూపరింటెండెంట్లతో రూల్స్‌పై కార్యచరణ రూపొందించారు. కమిటీ అధ్యయనంపై మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్షించారు.

పోలీసు శాఖలోని ప్రధాన విభాగాల్లో అమల్లో ఉన్న రూల్స్, ఉమ్మడి ఏపీ రూల్స్‌ అన్వయించుకుంటూనే పాత సమస్యలు పరిష్కరించుకునే అంశాలసౌ కమిటీ నాలుగేళ్లు అధ్యయనం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సర్వీస్‌ రూల్స్‌ను తీసుకొచ్చేందుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని కమిటీ తెలిపినట్లు సమాచారం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top