‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?

TDP Leaders Attack Sarpanch Candidate In Chittoor District - Sakshi

సర్పంచ్‌ అభ్యర్థిపై దాడి 

కారు అద్దాలు ధ్వంసం

ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

గెలవలేమనే దాడి చేశారంటున్న బాధితుడు

చిత్తూరు మండలం చెర్లోపల్లెలో ఘటన

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకపోయినా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. యథేచ్ఛగా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అల్లర్లు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. 

చిత్తూరు రూరల్‌: అభివృద్ధే ఎజెండాగా పలు పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడుస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని పల్లెసీమలు భావిస్తున్నాయి. ఈ ధోరణి నచ్చని టీడీపీ నేతలు పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్నారు. పలు ప్రాంతాల్లో అభ్యర్థులపై దౌర్జన్యం చేసి భయాందోళనకు గురిచేస్తున్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలపై గుర్తుతెలియని వ్యక్తులతో దాడులు చేయిస్తున్నారు. గ్రామాల్లో తిరగకూడదని హుకుం జారీచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. తమ అక్రమాలకు సహకరించని అధికారులపై ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. (చదవండి:  పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతల వీరంగం)

సర్పంచ్‌ అభ్యర్థిపై దాడి 
చిత్తూరు మండలం చెర్లోపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం సాయంత్రం భాస్కర్‌రెడ్డి తన స్నేహితుడి కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా వేంగారెడ్డిపల్లె వద్ద లారీ అడ్డొచ్చింది. దాన్ని తప్పించి పక్కకు వెళ్లబోగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చి భాస్కర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఇనుప రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న భాస్కర్‌రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు నంబర్‌ ప్లేట్‌ లేని హీరో ప్యాషన్‌ ప్రొ వాహనంలో వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్‌)

ఇది వారి పనే
ఇది కచ్చితంగా తెలుగు దేశం పార్టీ నేతలపనే. పంచాయతీలో ఎన్నికల్లో గెలవలేకే నాపై దాడికి దిగారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. టీడీపీ కుట్రలు తిప్పికొడతాం.
 – భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ అభ్యర్థి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top