ఉచ్చులు అమర్చిన వారిపై కఠిన చర్యలు 

Strict Measures Against Those Set Traps For Wildlife: PCCF Shobha - Sakshi

పోలీసుల అదుపులో పులి మృతి కారకులు 

వివరాలు వెల్లడించిన ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శోభ  

ములుగు: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ఉచ్చులు అమర్చే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శోభ హెచ్చరించారు. జిల్లాలోని ఎస్‌ఎస్‌ తాడ్వాయి అటవీ ప్రాంతంలో అమర్చిన ఉచ్చుకు పులి బలి అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్‌ సంగ్రాంసింగ్‌ జీ పాటిల్‌తో కలసి మీడియాకు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి ఆగస్టు 1న పులి జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పాదముద్రల ద్వారా గుర్తించామన్నారు. ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాల ద్వారా పులి కదలికలను పరిశీలించామని తెలిపారు. ఎస్‌ఎస్‌ తాడ్వాయి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కుకొని పులి మృతి చెందిందనే సమాచారం మేరకు అప్రమత్తం అయ్యామన్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి మృతిచెందిన పులి గోర్లను, చర్మాన్ని అమ్మడానికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి తీసుకెళ్తున్నట్లు తెలియడంతో ఆదివారం కాటాపురం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టామని చెప్పారు. ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి వద్ద పులి గోర్లు, చర్మం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం కొడిశాలగుంపునకు చెందిన మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముఖేశ్, మడవి దేవ, మడవి గంగయ్య ఉన్నారని వివరించారు.

కూలీ డబ్బులు చాలకపోవడంతో అటవీ జంతువులను వేటాడే దురాలోచనకు పూనుకొని ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పులి తిరుగుతుందనే సమాచారంతో ఉచ్చులు ఏర్పాటు చేయగా.. గత నెల 21న ఉచ్చులో పడి పులి మృతి చెందిందని శోభ చెప్పారు. పులి శరీర భాగాలను స్థానికులు మడకం రామ, మడకం ఉందయ్య, కోవాసి ఇడుము అడవిలో దాచిపెట్టారని.. విచారణలో ప్రశ్నించగా వాటిని చూపించారని తెలిపారు. స్థానిక వెటర్నరీ వైద్యుడు, ఎఫ్‌డీఓ వీటిని నిర్ధారించారని పేర్కొన్నారు. 


వివరాలు వెల్లడిస్తున్న పీసీసీఎఫ్‌ శోభ 

పులుల సంరక్షణ అందరి బాధ్యత...  
అంతరించిపోయే స్థితిలో ఉన్న పులుల సంరక్షణ బాధ్యత సమాజంలోని అందరిపై ఉందని సీసీఎఫ్‌ శోభ చెప్పారు. ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్‌ సంగ్రాంసింగ్‌ జీ పాటిల్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, వరంగల్‌ సర్కిల్‌ సీసీఎఫ్‌ ఆశ, డీఎఫ్‌ఓ శివఆశీష్, ఎస్‌ఎస్‌ తాడ్వాయి ఎఫ్‌డీఓ ప్రశాంత్‌ పాటిల్, ములుగు ఎఫ్‌డీఓ జోగేంద్ర, పస్రా ఇన్‌స్పెక్టర్‌ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్‌రావు, వెటర్నరీ డాక్టర్‌ కరుణాకర్, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top