తోడుగా ఒకరు.. కుటుంబం కోసం మరొకరు.. వారి ప్రయాణం ఒకచోటే ఆగింది

Srikakulam: Two Women Deceased Of Electric Shock In Kanchili - Sakshi

సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): ఒకరు భర్తకు తోడుగా పరిశ్రమ నడిపిస్తున్నారు. మరొకరు కట్టుకున్న వాడితో కష్టాన్ని పంచుకుంటున్నారు. కానీ వీరిద్దరి ప్రయాణం ఒక్క చోటే ఆగిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించి తామూ ఎదగాలనుకున్న మహిళ ఆశ అడియాస కాగా.. నెలకింత సంపాదించి భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయింది.

మండలంలోని పద్మతుల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కప్ప హేమలత(24), పిరియా రజని(35)లు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని మిక్చర్‌ తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ మధ్యన పనులు పెద్దగా లేకపోవడంతో కార్మికులు ఎవరూ రావడం లేదు. దీంతో నిర్వాహకుడు కప్ప వెంకటరావు భార్య హేమలత(24), అక్కడ పనిచేసే కార్మికురాలు మకరాంపురం గ్రామానికి చెందిన పిరియా రజని(35)లు బుధవారం ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి దిగారు. నీటితో కడుగుతుండగా మిక్చర్‌ తయారీలో పిండి మిక్సీ చేసే యంత్రం నుంచి కరెంటు పాస్‌ కావడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు.  (చదవండి: నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..)

కార్మికురాలు పిరియా రజని అక్కడికక్కడే మృతి చెందగా, యజమాని భార్య కప్ప హేమలత కొద్దిసేపటి వరకు మృత్యువుతో పోరాడి తర్వాత మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి హేమలత కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆమెను బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  

వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. 
ఈ పరిశ్రమ యాజమాని కప్ప వెంకటరావు స్వగ్రామం కేసరపడ. భార్య హేమలత కన్నవారి గ్రామం పద్మతుల. ఆరు నెలల కిందటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భర్త వెంకటరావుతోపాటు మిగతా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న రజని భర్త నారాయణ సమీపంలో ఉన్న ఒక పీచు పరిశ్రమలో పనిచేస్తున్నారు.

భార్య కూడా ఇక్కడ పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వీరికి వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో సాయి ఆరో తరగతి చదువుతుండగా, సాత్విక్‌ మూడో తరగతి చదువుతున్నాడు. వీరి స్వగ్రామం సోంపేట మండలం బెంకిలి. బతుకు తెరువుకోసం కొన్నాళ్ల నుంచి మకరాంపురంలో నివాసముంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: అంగన్‌వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top