‘మణప్పురం’లో దోపిడీ

Robbery In Manappuram Gold‌ Finance At Anantapur - Sakshi

సాక్షి, రాయదుర్గం: స్థానిక కణేకల్లు రోడ్డులోని మణప్పరం గోల్డ్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో సోమవారం దోపిడీ చోటు చేసుకుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో దుండగులు ప్రవేశించి, యాసిడ్‌ బాటిల్స్‌ వేసి భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు రివాల్వర్‌తో అసిస్టెంట్‌ మేనేజర్‌ తలపై బాది నగదు దోచుకెళ్లారు.  

రెక్కీ నిర్వహించి.. 
దోపిడీకి రెండు రోజుల ముందే దుండగులు రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. బంగారు నగలు తాకట్టు పెట్టాలంటూ శనివారం ఉదయం ఫైనాన్స్‌ కార్యాలయంలో మేనేజర్‌ మంజునాథ్‌ను ఇద్దరు యువకులు కలిసి మాట్లాడి వెళ్లారు. ఆ సమయంలోనే కార్యాలయంలో పనిచేస్తున్న వారి సంఖ్య, అందులోని భద్రతా ప్రమాణాలను వారు క్షుణ్ణంగా పసిగట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది.  

నగ తాకట్టు పేరుతో..  
సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి మణప్పురం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారిని సెక్యూరిటీ గార్డు అడ్డుకోవడంతో తాము బంగారు నగ తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ ఓ గోల్డ్‌ చైన్‌ను తీసి చూపించారు. దీంతో సెక్యూరిటీ గార్డు వారిని లోపలకు అనుమతించారు. దుండగులు లోపలకు ప్రవేశించగానే రెండు రివాల్వర్‌లు తీసి నగదు, బంగారం ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు.  

యాసిడ్‌ బాటిళ్లతో దాడి 
మారణాయుధాలు చూసి కార్యాలయంలోని సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అసిస్టెంట్‌ మేనేజర్‌ హరీష్‌ సైరన్‌ ఆన్‌ చేయడంతో అతని తలపై రివాల్వర్‌తో దాడి చేశారు. తలకు రివాల్వర్‌ గురిపెట్టి సైరన్‌ ఆఫ్‌ చేయించారు. తర్వాత ఎవరైనా కదిలితే కాల్చి వేస్తామంటూ తమతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ బాటిల్స్‌ను కార్యాలయంలోకి చెల్లాచెదురుగా విసిరారు. దీంతో సీట్లలో ఉన్న సిబ్బంది ప్రాణభయంతో భిక్కచచ్చిపోయారు.   

లాకర్‌ తీసేందుకు విఫలయత్నం 
అర గంట పాటు కార్యాలయంలో హల్‌చల్‌ చేసిన దుండగులు లాకర్‌ తీసేందుకు విఫలయత్నం చేశారు. తాళాలు ఇవ్వాలంటూ సిబ్బందిని ఒత్తిడి చేశారు. తమ వద్ద తాళాలు లేవని వారు చెప్పడంతో చివరకు క్యాష్‌ కౌంటర్‌లోని రూ.51,140 తీసుకుని కార్యాలయం గేట్‌కు తాళం వేసి పరారయ్యారు. తుపాకీ దెబ్బకు తలకు గాయమైన అసిస్టెంట్‌ మేనేజర్‌ తేరుకుని తన వద్ద ఉన్న రెండో తాళంతో గేటు తీసి, మేనేజర్‌ మంజునాథ్‌ సిబ్బందితో కలిసి వెంబడించేలోపు దుండగులు ద్విచక్ర వాహనంలో పరారయ్యారు.  

పరిశీలించిన పోలీసులు  
మణప్పురం ఫైనాన్స్‌ రాయదుర్గం శాఖ మేనేజర్‌ మంజునాథ ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాఘవేంద్రప్ప, సిబ్బందితో కలిసి దోపిడీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును కార్యాలయ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. దుండగులు విసిరిన బాటిళ్లలోని ద్రావకం యాసిడ్‌ కాదని తెలుసుకున్నారు.  సీసీ ఫుటేజీలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోపిడీ ఘటనపై ఆలస్యంగా సమాచారం ఇచ్చారన్నారు. దుండగులు బళ్లారి వైపు వెళ్లినట్లు తెలిసిందన్నారు. అన్ని రూట్లలోని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top