బరితెగించిన దొంగలు.. ఒకేసారి..

Robber Theft Shops In Srikakulam - Sakshi

సాక్షి,రణస్థలం(శ్రీకాకుళం): రణస్థలంలో దొంగలు అలజడి సృష్టించారు. 16వ నంబరు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న తొమ్మిది దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నా భయపడకుండా తమపని పూర్తిచేసేశారు. చోరీకి గురైన వాటిలో సెల్‌ఫోన్, డిపార్టమెంటల్‌ స్టోర్, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. అన్నిషాపుల్లో కలిపి 30 వేల రూపాయల వరకూ నగదు పోయినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తొమ్మిది షాపులకు చెందిన యజమానులు శుక్రవారం రాత్రి తాళాలు వేసేసి ఇళ్లకు వెళ్లిపోయారు.

శనివారం ఉదయం తెరిచేందుకు వచ్చేసరికి తలుపులు, గ్రీల్స్‌కు వేసిన తాళాలు విరగ్గొట్టి ఉండడంతో దొంగతనాలు జరిగినట్టు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నిషాపుల్లో నగదును మాత్రం దొంగలు పట్టుకుపోయారు. సెల్‌ఫోన్‌ షాపుల్లో సైతం ఫోన్లు చోరీ చేయలేదు. దొంగతనాలకు గురైన దుకాణాలను డీఏస్పీ మహేంద్ర, సీఐ బీసీహెచ్‌ నాయుడు, ఎస్సై రాజేష్‌ పరిశీలించారు. అన్ని షాపుల్లో ఒకే ముఠా చోరీలకు పాల్పడిందా లేక రెండు మూడు ముఠాలకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కనీసం ఆరుగురు దొంగతనాల్లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

షట్టర్లు, తాళాలు పగలగొట్టం పరిశీలిస్తే గ్రిల్స్, రాడ్డు బెండింగ్‌ పనులపై అవగాహన ఉన్నవారై ఉంటారని అనుమానిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని రాష్ట్ర, అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాల సంచారం కొన్నేళ్లుగా ఉంది. అయితే ఇప్పటివరకూ తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరిగేవి. పగలంతా తాళాలు వేసి ఉండే ఇళ్లను పరిశీలించి రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతుండేవారు. షాపుల్లో చోరీలు జరగడం తక్కువ. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో దుకాణాల్లో రాత్రి వేళ యజమానులు డబ్బులు ఉంచరు. రణస్థలంలో కూడా అదే జరిగింది. తొమ్మిది షాపుల్లో కేవలం రూ. 30 వేలు మాత్రమే పోయాయి. అందులో ఒక్క షాపులో మాత్రమే రూ. 11 వేలు ఉండగా, మిగతా షాపుల్లో చిన్న మొత్తంలో ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: నాలుగేళ్ల నుంచి సాన్నిహిత్యం.. ఫోన్‌చేసి ఇబ్బంది పెడుతోందని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top