TG: ఎవరా పెద్ద సారు?  | Sakshi
Sakshi News home page

రాధాకిషన్‌రావు వ్యవహారం.. ఎవరా పెద్ద సారు? 

Published Sat, Apr 13 2024 4:41 AM

Radhakishan Rao Involvement In Kidnapping And Money Extortion Through Phone Tapping - Sakshi

వేణుమాధవ్‌ కిడ్నాప్‌ కేసులో కీలకంగా నిందితుడు కృష్ణారావు 

ఆయన ద్వారానే ఈ వ్యవహారం ఉన్నతాధికారి వద్దకు.. 

మనీ లాండరింగ్, ఉగ్రవాదమంటూ బాధితుడికి బెదిరింపులు 

డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వేణుమాధవ్‌ స్నేహితుడు  

దీని వెనుక ‘హయ్యర్‌ అప్‌’ ఉన్నారని చెప్పిన రాధాకిషన్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్‌ ఆఫీస్‌) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్‌ అప్‌) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్‌ కేర్‌ డైరెక్టర్‌ వేణుమాధవ్‌ చెన్నుపాటి కిడ్నాప్‌ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది.  

కృష్ణారావు ద్వారా హయ్యర్‌ అప్‌ వద్దకు.. 
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో రిజిస్టర్‌ అయిన ఈ కేసులో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్‌.మల్లికార్జున్‌ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్‌ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్‌లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్‌ అప్‌’కూడా ఒకరని సమాచారం.

వేణు మాధవ్‌ను కిడ్నాప్‌ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్‌ కేర్‌ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లు గోపాల్, రాజ్‌ తలసిల, నవీన్, రవి... గోల్డ్‌ ఫిష్‌ అబోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్‌ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్‌ అప్‌ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్‌ చేయడానికి రూ.10 కోట్లకు డీల్‌ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  

డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్‌ 
సిట్‌ సమాచారం మేరకు.. 2018 నవంబర్‌ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్‌.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్‌ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్‌ దక్కించుకున్న వేణుమాధవ్‌ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు.

తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్‌ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్‌ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్‌ చేయించారు. ఆ కాల్‌ అందుకున్న రాధాకిషన్‌ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్‌ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు.  

ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. 
వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్‌ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్‌ తన నలుగురు పార్ట్‌టైమ్‌ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్‌ 3న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్‌ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు.

ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్‌ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్‌ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్‌ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్‌ అప్‌ విషయంలో సిట్‌ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది.  

సిట్‌ అదుపులో ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌ 
రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్‌ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ పోలీసులు, సిట్‌ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో (ఎస్‌ఐబీ) ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్‌ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement