
చిన్నారులతో తల్లి నందిని(ఫైల్)
సాక్షి, బళ్లారి: అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులే చెరువులోకి తోసి ప్రాణాలను తీసిన దారుణ సంఘటన ఇది. కూడ్లిగి తాలూకా గుడేకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామదుర్గ చెరువులోకి మల్లనాయకనహళ్లికి చెందిన చిరంజీవి, ఆయన భార్య నందిని తమ కుమార్తె ఖుషి (3), కుమారుడు చిరు(1)ను మంగళవారం రాత్రి చెరువులోకి తోసివేశారు. బైకుపై వెళ్లిన నలుగురు చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
గొడవలతో తీవ్ర నిర్ణయం
చిరంజీవి, అతని భార్య నందిని తరచూ గొడవలు పడేవారని, అప్పులు అధికం కావడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చెరువు వద్దకు వెళ్లి మొదట చిన్న పిల్లలను తోసేశారు. భార్యభర్తలిద్దరూ దూకడానికి యత్నించగా ధైర్యం చాలలేదు. దీంతో ఆత్మహత్యాప్రయత్నం విరమించుకున్నామని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. అప్పుల బాధ నెపంతో చిన్నారులను రాక్షసంగా చెరువులోకి తోసివేసిన కసాయి తల్లిదండ్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గుడేకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పీఎస్‌ఐ రామప్ప తెలిపారు.