విషాదం: పొగతో ఊపిరి ఆడక.. వీధి కుక్కల అరుపులతో.. 

Man Deceased With Fire Accident In Hyderabad - Sakshi

డూప్లెక్స్‌ ఇంట్లో అగ్నిప్రమాదం 

ఒకరు మృతి, చికిత్స పొందుతున్న ముగ్గురు  

వీరంతా ఒక కుటుంబానికి చెందిన వారే.. 

ఫాంహౌజ్‌కు వెళ్లడంతో మిగతావారు సేఫ్‌ 

షార్ట్‌ సర్క్యూట్‌ కావొచ్చంటున్న పోలీసులు 

సాక్షి, హిమాయత్‌నగర్‌: నారాయణగూడ పరిధిలోని ఓ డూప్లెక్స్‌ హౌజ్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. పెద్దఎత్తున ఎగిరిపడిన మంటల నుంచి తప్పించుకునేందుకు మొదటి అంతస్తులో నిద్రిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు బాత్రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. పొగతో ఊపిరి ఆడక భర్త మృతిచెందగా.. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఓ కుటుంబ సభ్యుడిని పోలీసులు రక్షించారు.

 
మిగతావారు ఫామ్‌హౌస్‌కు వెళ్లడంతో.. 
వ్యాపారి గోల్కొండ శాంతారామ్‌ తన భార్య శోభ, ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనుమలు, మనవరాళ్లతో కలిసి బషీర్‌బాగ్‌ అవంతినగర్‌ పార్క్‌ ఎదురుగా ఉండే డూప్లెక్స్‌ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శాంతారామ్‌ కుమారులు సైతం వ్యాపారులే. జీ+2 గా నిర్మించిన ఆ ఇంట్లో మొత్తం 15 మంది కుటుంబీకులు నివసిస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శాంతారామ్, ఆయన భార్య శోభ, చిన్న కుమారుడు శ్రీనాథ్, ఇతడి భార్య దివ్య, వీరి పిల్లలు మన్వి, మహదేవ్‌లు వికారాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. వీరి కుమారుడు గౌరీనాథ్, ఆయన భార్య మీన, ఇద్దరి పిల్లలు లోకేష్‌(11), విగ్నేష్‌(8) ఇంటి రెండో అంతస్తులో ఉన్నారు. మరో కుమారుడు బద్రీనాథ్‌ మొదటి అంతస్థులో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున ఇల్లు పొగచూరి ఉండటాన్ని గమనించారు. తేరుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. దీంతో బద్రీనాథ్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. రెండో అంతస్తులో ఉన్న గోపీనాథ్‌ కుటుంబం కూడా ఇదే పని చేసింది.  


ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు

వీధి కుక్కల అరుపులతో.. 
వీధి కుక్కలు అరవడంతో స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ సిబ్బంది మొదటి ఫ్లోర్‌లోని బద్రీనాథ్‌ను కిటికీలోంచి బయ టకు తీసుకువచ్చారు. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్‌ మంటలను ఆర్పుకుంటూ రెండో అంతస్తులోకి వెళ్లారు. అక్కడి బాత్‌రూమ్‌ నుంచి ‘కాపాడండి.. కాపాడండి’ అంటూ శబ్ధం రావడంతో మీనతో పాటు ఇద్దరు పిల్లల్ని రెస్క్యూ చేసి సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. గౌరీనాథ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం గౌరీనాథ్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న ఏసీ నుంచి షార్ట్‌ సర్క్యూట్‌ అయి ఉండొచ్చని నారాయణగూడ పోలీసులు అనుమానిస్తున్నారు. గౌరీనాథ్‌ భార్య మీన, ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top