యువకుడి హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్‌

Man Deceased Case Police Arrest Nine People In Guntur District - Sakshi

నగరంపాలెం (గుంటూరు): యువకుడి హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఎస్పీ కథనం మేరకు.. గతనెల 22న గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీ (కేవీపీ కాలనీ) ఒకటో వీధికి చెందిన యువకుడు బత్తుల గోపీనాథ్‌ లాలుపురం రోడ్డులోని గెలాక్సీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. గోపీనాథ్, అతని స్నేహితులు మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడ్డారు.

గత నెల 22న కేవీపీ కాలనీ రెండో వీధికి చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ చికెన్‌ కొట్టు మస్తాన్‌తో రూ.100 ఇవ్వాలంటూ గోపీనాథ్‌ గొడవ పడ్డాడు. అదే సమయంలో ఏమి జరిగిందని మస్తాన్‌ను అదే ప్రాంతానికి చెందిన కగ్గా వెంకటేష్‌ ఆరా తీశాడు. అదే సమయంలో గోపీనాథ్‌ ఓ రాయిని మస్తాన్‌పై విసరగా అది వెంకటేష్‌కు తగిలింది. వెంకటేష్‌ అదేమని అడగ్గా గోపీనాథ్‌ మళ్లీ రాయితో గాయపరిచాడు. వెంకటేశ్‌ తన సోద రుడు కగ్గా వెంకట నరసయ్యకు ఫోన్‌లో జరిగిన విషయం చెప్పి, స్నేహితులతో రావాలని కోరాడు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు
గొడవ జరిగిన అర గంటకు వారంతా వెంకటేష్‌ ఇంటి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కలుసుకుని గోపీనాథ్‌ను చంపాలని నిర్ణయించారు. వెంకటేశ్, వెంకట నరసయ్య, బోలా సురేంద్ర అలియాస్‌ రెడ్డి సురేంద్ర, తలమాల సాల్మన్‌రాజు, కేవీపీ కాలనీకి చెందిన బాల నేరస్తుడు, చికెన్‌కొట్టు మస్తాన్, జోసఫ్‌నగర్‌కు చెందిన మద్దెల రాజేష్, దాసరిపాలెం ప్లాట్స్‌కు చెందిన షేక్‌ మస్తాన్‌వలి అలియాస్‌ రింగులు, షేక్‌ పెద్దమస్తాన్‌ కర్రలు, కత్తులతో గెలాక్సీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. క్యాష్‌ కౌంటర్‌ వద్ద ఉన్న గోపీనాథ్‌పై కర్రలు, కాళ్లూ చేతులతో దాడిచేశారు. గోపీనాథ్‌ చనిపోయాక అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ కేసులో నిందితులైన బాలనేరస్తుడు సహా తొమ్మిది మందిని శుక్రవారం లాలుపురం రోడ్డులోని ఖాళీ ప్లాట్స్‌ వద్ద డీఎస్పీ కె.సుప్రజ పర్యవేక్షణలో నగరపాలెం సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐలు జి.కిరణ్‌బాబు, షేక్‌ మౌలా షరీఫ్, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.భూపతి, కానిస్టేబుళ్లు వై.మాణిక్యరావు, డి. రమేష్, బి.కిరణ్‌ బాబు, జి.అచ్చయ్య  పట్టుకు న్నారు. నిందితుల వద్ద రెండు కర్రలు, రెండు వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీస్‌ సిబ్బందికి రివార్డులు అందజేస్తామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో ఏఎస్పీ గంగాధర్, డీఎస్పీ కె.సుప్రజ, సీఐ మల్లికార్జునరావు పాల్గొన్నారు.
చదవండి: నా ప్రమేయం లేకుండా పనికి వెళతావా?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top