కాకినాడ జిల్లాలో దారుణం.. ప్రేమను నిరాకరించిందని..

Man Attacked with knife on Young Woman for Refusing his love at Kakinada - Sakshi

కరప/కాకినాడ క్రైం: ప్రేమోన్మాది చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో  పట్టపగలు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల సమీపంలో శనివారం ఈ దారుణం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం గంగవరానికి చెందిన కాదా రాంబాబు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన కుమార్తె దేవిక(21) కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలోని అమ్మమ్మ.. కొప్పిశెట్టి చంద్రమ్మ ఇంటి వద్ద ఉంటూ కాకినాడ పీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల వెంకటసూర్యనారాయణ కూరాడలోని మేనమామ ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా దేవిక వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక దేవిక ఈ విషయాన్ని బంధువులకు, పెద్దలకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. అతడి మేనమామ కూడా యువకుడిని మందలించి ఏదైనా పనిచేసుకోవాలంటూ హైదరాబాద్‌కు పంపారు.

కాగా, మళ్లీ అతను ఇక్కడికొచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం దేవిక కరపలోని ఓ షాపులో వస్తువులు తీసుకుని తిరిగి కూరాడకు బైక్‌పై బయలు దేరింది. పెదపూడి మండలం కాండ్రేగుల, కూరాడ గ్రామాల మధ్యలో ఆమె బైక్‌ను వెంకటసూర్యనారాయణ ఆపి.. తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి దేవికను అత్యంత కిరాతకంగా నరికివేశాడు. ఆ రోడ్డు పరిసర పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలు వచ్చి నిందితుడిని పట్టుకుని.. చెట్టుకు కట్టేసి కొట్టారు.

సమాచారం తెలుసుకున్న కాకినాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్, పెదపూ డి ఎస్‌ఐ  వాసులు ఘటన స్థలానికి చేరుకుని.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న దేవికను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై 48 కత్తి పోట్లున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి 
ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తీసుకెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారని కురసాల తెలిపారు. ఈ సంఘటన తీవ్రంగా కలచి వేసిందని సీఎం చెప్పినట్టు తెలిపారు. ఈ ఘాతుకానికి బలైన దేవిక కుటుంబం చాలా నిరుపేద కుటుంబమ ని సీఎంకు వివరించామన్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా మానవతా దృక్పథంతో ఆదుకుంటామని సీఎం జగన్‌ చెప్పారని కన్నబాబు వెల్లడించారు. 

చదవండి: (అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top