'దొంగ' పనిమనిషి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

'దొంగ' పనిమనిషి అరెస్ట్‌

Published Fri, Jan 8 2021 8:26 AM

Maid Arrested In Gold Robbery Case In Amalapuram - Sakshi

సాక్షి, అమలాపురం టౌన్(తూర్పు గోదావరి)‌: ఓ వృద్ధురాలి వద్ద పనిమనిషిగా చేరిన రోజే రూ.8.60 లక్షల విలువైన 23 కాసుల బంగారు నగలను దోచుకెళ్లిన మాయ‘లేడీ’ని అమలాపురం పోలీసులు అరెస్ట్‌ చేసి దోచుకెళ్లిన సొత్తు అంతా ఆమె నుంచి రికవరీ చేశారు. అమలాపురం కల్వకొలనువీధిలో పక్షవాతంతో మంచంపై చికిత్స పొందుతున్న పలచర్ల అనంతలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్దురాలికి సపర్యలు కోసం పనిమనిషిగా ఎరువ మేరీ సునీత రావడం..వచ్చిన రోజే అంటే ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బంగారు నగలతో పరారు కావడం వంటి పరిణామాలు తెలిసిందే. పనిమనిషిగా చేరి చోరీకి పాల్పడిన 42 ఏళ్ల మేరీ సునీత గుంటూరు జిల్లా గురజాల మండలం రెంటచింతల గ్రామవాసిగా అమలాపురం పోలీసులు గుర్తించారు. చోరీ జరగగానే విజయవాడ, హైదరాబాద్‌కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు ఆమెను వెంటాడి అరెస్ట్‌ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి. విజయవాడ శ్రీనివాస హోం కేర్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా మేరీ సునీతను అమలాపురంలో అనంతలక్ష్మి వద్ద పనిమనిషిగా పెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 9 గంటలకు అమలాపురం ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వద్ద మేరీ సునీతను అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న రూ.8.60 లక్షల విలువైన బంగారు నగలను డీఎస్పీ వై.మాధవరెడ్డి, పట్టణ సీఐ ఎస్‌కే బాజీలాల్‌ స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చూపించి, వివరాలను వెల్లడించారు. (చదవండి: తొలి రోజే 24 కాసుల బంగారంతో ఉడాయింపు)

ప్రతిచోటా పనిమనిషి ముసుగులోనే చోరీలు 
గత కొన్నేళ్లుగా ధనికులైన వృద్ధుల వద్ద సపర్యలకు పనిమనిషిగా చేరి ఆ ముసుగులో చోరీ చేయడంలో మేరీ సునీత చేయి తిరిగిన నేరస్థురాలని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ తరహాలో హైదరాబాద్‌లో ఆమె 11 కేసులు, విశాఖపట్నంలో రెండు కేసుల్లో నిందితురాలు. ఈ 13 కేసులకు సంబంధించి మూడు కేసుల్లో జైల్లో శిక్షలు కూడా అనుభవించిందని చెప్పారు. అమలాపురం చోరీ కేసుకు సంబంధించి ఆమె ఎంత బంగారం దోచుకెళ్లిందో అంత బంగారాన్ని కేవలం రెండు రోజుల్లో సీఐ బాజీలాల్‌ బృందం రికవరీ చేసిందన్నారు. మేరీ సునీత సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సాంకేతికత సహాయంతో ఆమె కదలికలను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఈ కేసులో డీఎస్పీ మాధవరెడ్డి, ఇన్‌చార్జి డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సీఐ బాజీలాల్, పట్టణ ఎస్సైలు ఎం.ఏసుబాబు, కె.చిరంజీవి, జిల్లా ఐటీ కోర్‌ క్రైమ్‌ ఎస్సై ఎం.ఉస్మాన్, హెడ్‌ కానిస్టేబుల్‌ మామిళ్లపల్లి సుబ్బరాజు, కానిస్టేబుళ్లు మల్లాడి హరిబాబు, రమేష్‌బాబు, వీరబాబు, నాగేంద్రబాబు, ఎం.మూర్తి, సీహెచ్‌ మాధవిలను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి అభినందించారు.

Advertisement
Advertisement