ఉద్యోగం రాక కాదు.. మోసపోవడంతోనే ఆత్మహత్య

Khammam Penuballi Un Employee Suicide Case New Update - Sakshi

దళారీకి డబ్బులు ఇచ్చి మోసపోవడంతోనే ఆత్మహత్య 

పెనుబల్లి నిరుద్యోగి ఆత్మహత్య కేసులో కొత్త కోణం 

దళారీ సూచనతోనే పోలీసులకు తప్పుగా ఫిర్యాదు

పెనుబల్లి: ఉద్యోగం రాక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన సానిక నాగేశ్వరరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఉద్యోగం ఇప్పిస్తానన్న ఓ దళారీ చేతిలో మోసపోయాడని పోలీసులు వెల్లడించారు. నాగేశ్వరరావు దళారీని నమ్మి రూ.5.5 లక్షలు ఇవ్వగా.. అతను మోసం చేయడంతో ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాక, అటు డబ్బులు పోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసులో సెక్షన్లు మార్చిన పోలీసులు సోమవారం వివరాలను వెల్లడించారు.

ఏసీపీ వెంకటేశ్‌ కథనం ప్రకారం.. గంగదేవిపాడుకు చెందిన నాగేశ్వరరావు ఎంఏ పూర్తిచేశాక, 2018 నుంచి వివిధ వ్యాపారాలు చేసి లాభాలు రాక ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్దిశెట్టి సామేల్‌ అనే దళారీకి ఉద్యోగంకోసం రూ.5.5 లక్షలు ఇచ్చాడు. డబ్బు తీసుకున్నాక సామేల్‌ దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండడంతో నాగేశ్వరరావు కొద్ది రోజుల కిందట తండ్రి వెంకట్రామయ్య, మధ్యవర్తి చెన్నారావుతో కలిసి వెళ్లి డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరాడు. అయినా అతను స్పందించకపోవడంతో తన వల్ల కుటుంబం బాధపడుతోందన్న ఆవేదనతో నాగేశ్వరరావు ఈనెల 13న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 14వ తేదీన మృతి చెందాడు.

ఈ విషయాన్ని చెన్నారావు ఫోన్‌లో సామేలుకు తెలియజేయగా.. ఉద్యోగం రాలేదనే బెంగతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని చెప్పగా అలాగే ఫిర్యాదు చేశారు. ఇంతలోనే పోలీసులు విచారణ చేపట్టడంతో సామేల్‌ భయపడి ఈనెల 15న రూ.5.5 లక్షలతో పాటు వడ్డీ కింద మరో రూ.60 వేలు చెన్నారావు అకౌంట్‌లో జమ చేశాడు. విచారణలో ఇవన్నీ వెల్లడి కావడంతో మద్దిశెట్టి సామేలు, చెన్నారావుపై 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్‌ తెలిపారు. సామేల్‌ చేతిలో మోసపోయిన వారు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ టి.కరుణాకర్, ఎస్సైలు తోట నాగరాజు, తేజావత్‌ కవిత పాల్గొన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top