పాకెట్‌ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని..

Hyderabad: College Students Involving In Drugs For Pocket Money - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌కు చెందిన సాయికుమార్, ప్రతాప్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. పాకెట్‌ మనీ కోసం గంజాయి వ్యాపారంలోకి దిగారు. ఒడిశా రాష్ట్రంలోని సీలేరు ప్రాంతంలో మంగళ్‌ అనే వ్యక్తి నుంచి ఎండు గంజాయిని కిలో రూ.10 వేలకు కొనుగోలు చేసి బస్సుల్లో అక్రమంగా రవాణా చేస్తున్నారు. శివారు ప్రాంతంలో వాటిని 5, 10 గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి.. రూ.150– 200కు విక్రయిస్తున్నారు’ 

‘దుస్తుల వ్యాపారం పేరిట మార్క్‌ ఒవాలోబీ నైజీరియా నుంచి ముంబైకి వచ్చాడు. బిజినెస్‌ వీసా గడువు ముగిశాక.. ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఢిల్లీ నుంచి కొకైన్‌ను తీసుకొచ్చి నగరంలో విక్రయించడం మొదలుపెట్టాడు. పలుమార్లు జైలుకెళ్లాడు. నేరెడ్‌మట్‌కు చెందిన బీకామ్‌ ఫైనలియర్‌ విద్యార్థి హర్షవర్ధన్‌ స్నేహితుడైన అభిషేక్‌ సింగ్‌ ఓ చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ మార్క్‌ ఒవాలోబీతో ఇతగాడికి పరిచయం ఏర్పడింది. బయటికొచ్చాక ఈ ముగ్గురు, మరికొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్‌ వ్యాపారం చేయడం ప్రారంభించారు’ 

.. ఇలా ఒకటి రెండు సంఘటనల్లోనే కాదు డ్రగ్స్‌ వినియోగిస్తూ.. విక్రయిస్తూ ఎందరో విద్యార్థులు పట్టుబడుతున్నారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిన విద్యార్థులు.. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఫ్యాషన్‌గా మొదలు పెట్టి డ్రగ్స్‌ బానిసలుగా మారిపోతున్నారు. 

జైలులో పెడ్లర్లతో పరిచయాలు.. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరఫరాదారులే కాదు వినియోగదారులపై కూడా కేసులు నమో దు చేస్తూ అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మూలాలను అంతమొందిస్తే తప్ప డ్రగ్స్‌ను అరికట్టలేమని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. కేవలం సరఫరాదారులను అరెస్ట్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిమాండ్‌కు తరలించి జైలుకెళ్లిన నిందితులలో సత్ప్రవర్తన రాకపోగా.. జైలులో కొత్త పరిచయాలు ఏర్పరుచుకొని బయటికొచ్చాక సరికొత్త ఎత్తుగడలతో డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు వరుసగా వెలుగుచూడటమే ఇందుకు ఉదాహరణ. గంజాయి రవాణాలు రౌడీషీటర్లు, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులు కూడా దిగారు. 

ప్యాకెట్‌కు రూ.150– 200.. 
►కొకైన్‌ బంగారం కంటే చాలా ఖరీదైనది, దీన్ని అందరూ కొనుగోలు చేయలేరు. దీంతో గంజాయి విక్రయం, వినియోగం పెరిగింది. కిలో రూ.15– 20 వేలకు కొనుగోలు చేసి.. శివారు ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ప్యాకెట్‌ రూ.150– 200కు దొరకుతుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసే వీలుంటుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.  

►ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత సొంతూర్లకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో బ్యాగులలో గంజాయిని తీసుకొస్తున్నారు. తాము సేవించడమే కాకుండా తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి 5, 10 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన లాబా కుమార్‌ ప్రధాన్, బాపిలను ఇటీవల కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

►ఇదే తరహాలో ఆదిలాబాద్‌ నుంచి కిలో గంజాయి రూ.15 వేలకు కొనుగోలు చేసి నగర శివార్లలో ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు జవహర్‌నగర్‌కు చెందిన బొడ్డు అభిషేక్, గాజుల పరమేష్, వడ్డారం ప్రవీణ్, ఆర్‌ శివలను ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top