దారుణం: భర్త రాక్షసత్వానికి ఇటీవల అబార్షన్‌.. ఇప్పుడు చీర కొనుక్కుందని ఏకంగా..

Husband Assassinated Wife Brutally West Godavari - Sakshi

ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో భార్య మృతి

ప్రేమించి పెళ్లి చేసుకుని.. నరకం చూపించాడు 

గతంలోనూ తీవ్రంగా కొట్టడంతో గర్భస్రావం

సాక్షి,నల్లజర్ల( పశ్చిమ గోదావరి): ప్రేమించానంటూ వెంటపడ్డాడు. అతనిని నమ్మి పెళ్లి చేసుకున్న ఆ యువతికి భర్త నరకం చూపించాడు. చివరకు అతనే కర్కశంగా హతమార్చాడు. చీర కొనుక్కుందన్న కోపంతో ఇటుక రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలేనికి చెందిన కళ్యాణం దుర్గా ప్రసాద్, పెంటపాడు మండలం  రామచంద్రాపురానికి చెందిన దానమ్మ పెద్దలను ఎదిరించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. 

దానమ్మ తల్లిదండ్రులు బూరలు, రబ్బర్‌ బ్యాండ్లు, చెంపిన్నులు.. వంటి సామగ్రి విక్రయిస్తూ జీవనం సాగించేవారు. దుర్గాప్రసాద్‌ కూడా అదే వృత్తి చేసేవాడు. తాగుడు, జూదానికి బానిసైన అతను ఇంటి బాధ్యత వదిలేశాడు. వీరికి ఒక కుమార్తె పుట్టింది. ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడటంతో దానమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేసి భర్త, అత్త మామలను పోషించేది. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ ఆమె భిక్షాటన చేసి తీసుకొచ్చిన సొమ్ము కూడా లాక్కునేవాడు. దానమ్మ గర్భిణి అని చూడకుండా తీవ్రంగా కొట్టడంతో 20 రోజుల క్రితం ఆమెకు గర్భస్రావమైంది.

ఇటీవల భర్తకు తెలియకుండా రూ.200తో చీర కొనుక్కుందని తెలిసి ఆమెతో బుధవారం రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య గొడవ జరిగింది. అత్త మరిడమ్మ కూడా అతనికి తోడైంది. ఈ గొడవ పెరిగి పక్కనే ఉన్న ఇటుక రాయితో దానమ్మను తీవ్రంగా కొట్టాడు. బాధ తట్టుకోలేక ఆమె అరిచిన అరుపులకు రాత్రి పది గంటల సమయంలో చుట్టుపక్కలవారు పోగయ్యారు. దెబ్బలకు దానమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. దానమ్మను భర్త, అత్త కొట్టి చంపారని మృతురాలి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్, నల్లజర్ల ఎస్‌ఐ అవినాష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహహింసకు పాల్పడినందుకు, అబార్షన్‌కు కారణమైనందుకు భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. తల్లిని కోల్పోయిన ఏడాది వయసున్న చిన్నారి ఏం జరిగిందో తెలియక బిత్తరచూపులు చూస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top