మృత్యువులోనూ వీడని స్నేహం

Hukumpeta Tragedy: Two Bodies Recovered From Godavari River - Sakshi

గోదావరిలో గల్లంతైన రెండు మృతదేహాలు లభ్యం

తల్ల్లడిల్లుతున్న బాబి తల్లి, చిన్న తల్లిదండ్రులు

హుకుంపేటలో విషాదం

ఆత్రేయపురం/రాజమహేంద్రవరం రూరల్‌:  బిడ్డలను కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో మంగళవారం సాయంత్రం నలుగురు విద్యార్థులు స్నానం చేస్తుండగా ఇద్దరు గల్లంతైన విషయం విదితమే. బుధవారం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఈతగాళ్లతో గాలించడంతో  పిచ్చుకలంకకు సుదూర ప్రాంతంలో హుకుంపేట గ్రామానికి చెందిన మెండి జోసఫ్‌  (బాబి)(15), ఈతకోట చిన్న(15) మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను ఆత్రేయపురం ఎస్సై నరేష్‌ పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఇరువురి మృతదేహాలు హుకుంపేట చేరుకోవడంతో వారి ఇండ్లతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఇద్దరూ ప్రాణ స్నేహితులని..ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే వారని, చివరికి మరణంలో కూడా వీరి స్నేహబంధం వీడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురు ఒకే రెడ్‌ కలర్‌ టీషర్టులు ధరించి ఉండటం చూపరులను కంటతడి పెట్టించింది.

కుటుంబాల ఇంట గూడుకట్టిన విషాదం 
మెండు జోసఫ్‌(బాబి) తండ్రి రవికుమార్‌ నాలుగేళ్ల క్రితం మోరంపూడి సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి కమలకుమారి కూలిపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. మతిస్థిమితం లేని అక్కను చూసుకుంటుంది. చదువుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న తరుణంలో బాబి మరణించాడు. దీంతో కమలకుమారి తనను అన్యాయం చేసి వెళ్లిపోయావా కొడకా అంటూ గుండెలవిసేలా రోదించింది. ఈతకోట చిన్న తల్లిదండ్రులు రాణి, వెంకన్న కూలిపనులు చేసుకుని ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ వస్తున్నారు. చిన్నకు అక్క,అన్నయ్య ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన చిన్నను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సరాదాగా స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లితండ్రులు రాణి, వెంకన్న తేరుకోలేకపోతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top