డ్రైవర్‌ నిర్లక్ష్యంతో.. సంధ్య వాలింది

Heavy Rain: Family Death Tragedy In Karnataka - Sakshi

సాక్షి, తిరుపతి తుడా/రాయచూరు (కర్ణాటక): రాయచూరు సమీపంలోని ముదగల్‌ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(55)కి సువర్ణ, సంధ్య, సౌమ్య, సుజిత్‌ నలుగురు పిల్లలు. పెద్ద అల్లుడు సువర్ణ భర్త వినోద్‌కుమార్, రెండో అల్లుడు సంధ్య భర్త హరీష్‌తో పాటు రెండేళ్ల మనుమరాలు విన్మయ్‌ తదితర కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందితో గురువారం రాత్రి బెంగళూరు మీదుగా శుక్రవారం కంచికి చేరుకున్నారు.

అక్కడ అమ్మవారిని దర్శించుకుని తిరుమల వెళ్లేందుకు తిరుపతికి బయలుదేరారు. రాత్రి 12 నుంచి ఒంటి గంట దాకా నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద 8 అడుగులకు పైగా నీరు చేరింది. ఇదే సమయంలో వారు ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనం రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్దకు చేరింది. డ్రైవర్‌ ఆంజనేయులు నిర్లక్ష్యంగా వాహనాన్ని నీటిలో దింపాడు. మధ్యలో ఇంజిన్‌ ఆగిపోవడం.. అంతలోనే నీటి ప్రవాహం పెరగడంతో వాహనం పూర్తిగా మునిగిపోయింది.  

చీర విసిరినా..  
నీట మునిగిన వాహనంలోని పిల్లలు, అల్లుళ్లు, మనుమరాలును కాపాడేందుకు ఇంటికి పెద్ద దిక్కు అయిన భాగ్యశ్రీ విశ్వప్రయత్నాలు చేసింది. తన చీరను అప్పటికే గట్టువద్దకు చేరుకున్న పోలీసులు, స్థానికుల వద్దకు విసిరింది. వాహనంలోని వారు చీర సహాయంతో ఒక్కొక్కరూ గట్టుకు చేరారు. వెనుక సీటులో నిద్రిస్తున్న సంధ్యను గుర్తించలేకపోయారు. వారందరూ బయటకు వచ్చిన రెండు నిమిషాల తర్వాత సంధ్య కోసం ప్రయత్నించగా.. ఊపిరి ఆడక వాహనంలోనే తుది శ్వాస విడిచింది. 

విధికి కన్నుకుట్టిందేమో..  
ముదగల్‌కు చెందిన సంధ్య(28)కి సమీపంలోని లింగసూగూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హరీష్‌ గుప్తా(30)తో ఇటీవలే వివాహమైంది. చూడచక్కని జంట. చిలకా గోరింకల్లా ఉన్నారని అందరూ సంతోషపడ్డారు. ఇంతలో విధికి కన్నుకుట్టిందేమో.. నవ వధువును అర్ధంతరంగా కబళించింది. సంధ్య స్వగ్రామంలో, అటు అత్తవారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top