తెల్లారిన బతుకులు..

Grand Father And Grand Daughter Deceased With Current Shock - Sakshi

కరెంట్‌ కాటుకు తాతామనుమరాలు బలి

తెగిపోయిన వైరును గమనించకపోవడంతోనే ప్రమాదం

ఎఖీన్‌పూర్‌లో విషాదం

కోరుట్ల: ఇంట్లో వెలుగులు నింపే విద్యుత్‌ తీగలు ఆ కుటుంబానికి శాపంగా మారాయి. తెల్లవారకముందే ఆ తాతామనుమరాళ్ల జీవితాలు తెల్లారిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి తెగిపడిన విద్యుత్‌తీగ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిశాయి. కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఎఖీన్‌పూర్‌కు చెందిన తాతమనుమరాళ్లు అందుగుల మల్లయ్య(65), మౌనిక(17) మృతి ఆ గ్రామంలో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఎఖీన్‌పూర్‌ గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేసే విద్యుత్‌తీగ గురువారం తెల్లవారు జామున తెగి అందుగుల మల్లయ్య ఇంటి ఆవరణలో పడిపోయింది.

ఆ తీగ గేదెకు తగిలి షాక్‌కొట్టడంతో అరుపులు వినిపించిన మల్లయ్య భార్య మల్లవ్వ గేదె వద్దకు వెళ్తున్న క్రమంలో చేతికి వైరు తగిలి షాక్‌కు గురైంది. గమనించిన మల్లయ్య తన భార్యను ప్రమాదం నుంచి తప్పించాడు. ఈక్రమంలో అతడి కాలుకు విద్యుత్‌తీగ తగలడంతో షాక్‌ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లయ్యను ప్రమాదం నుంచి తప్పించబోయిన మనుమరాలు మౌనిక కాలుకు విద్యుత్‌తీగ తగలడంతో షాక్‌తో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మౌనిక కోరుట్లలోని మాస్ట్రో జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఒకే కుటుంబంలోని ఇద్దరి మృతి గ్రామంలో విషాదం నింపింది. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరమ్మతులు చేయాలని ఏళ్లుగా..
ఎఖీన్‌పూర్‌ పరిధిలో విద్యుత్‌ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని ఏళ్లుగా ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. మరమ్మతుల గురించి అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చేవారని వారు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతోనే మల్లయ్య, మౌనిక మృతిచెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌తీగలు మరమ్మతు చేసే వరకు బిల్లులు చెల్లించబోమని నిర్ణయించినట్లు స్థానికులు పేర్కొన్నారు. 

పరామర్శించిన ఎమ్మెల్యే
ఎఖీన్‌పూర్‌లో విద్యుత్‌ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తాతమనుమరాళ్లు మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఓదార్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top