వివాహితపై గ్యాంగ్‌ రేప్‌

Gang rape on married women in Guntur - Sakshi

భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడి 

బలవంతంగా నగలు దోచుకున్న ఆగంతకులు 

మూడు గంటలపాటు చిత్రహింసలు 

గుంటూరు జిల్లాలో దారికాచి దారుణం  

పోలీసుల అదుపులో ఎనిమిది మంది అనుమానితులు 

మేడికొండూరు మండలం పాలడుగు వద్ద దుర్ఘటన 

మేడికొండూరు (తాడికొండ): ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న దంపతులను అటకాయించి గుర్తుతెలియని దుండగులు వారిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. భార్యాభర్తలిద్దరినీ కత్తులతో బెదిరించిన వారు భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గుండెలను దహించే ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో బుధవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని సత్తెనపల్లి రూరల్‌ మండలం పెంటపాడుకు చెందిన దంపతులు కొంతకాలంగా సత్తెనపల్లిలో ఉంటున్నారు. బంధువుల ఇంట బారసాల కార్యక్రమానికి బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు వెళ్లారు. వేడుక అనంతరం రాత్రి 9.30 గంటలకు సత్తెనపల్లికి ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. పాలడుగు రోడ్డు మూలమలుపు వద్ద దారికి అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండటంతో ద్విచక్ర వాహనం ఆపారు. ఇంతలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లపై నుంచి నలుగురు దుండగులు ఒక్కసారిగా కిందకు దూకారు.

మద్యం మత్తులో ఉన్న వారు కత్తులు చూపి దంపతులను బెదిరించారు. పక్కనే ఉన్న పొలాల్లోకి వారిని, ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లారు. భర్తను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చెట్టుకు కట్టేసి అరిస్తే చంపుతామని బెదిరించారు. అనంతరం మహిళపై నలుగురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నారు. తర్వాత వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చి ద్విచక్రవాహనం స్టార్ట్‌చేసి అరవకుండా వెళ్లిపోవాలని బెదిరించారు. సుమారు 3 గంటల పాటు దంపతులను చిత్రహింసలకు గురిచేశారు. తీవ్ర వేదనతో బయలుదేరిన దంపతులు అర్ధరాత్రి సమయంలో సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.

అక్కడి పోలీసులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడికొండూరు పోలీసులు సత్తెనపల్లి వెళ్లి బాధితులను కారులో ఎక్కించుకుని ఘటనా ప్రదేశానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన దంపతులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించాయి. గుంటూరు అర్బన్‌ అడిషనల్‌ ఎస్పీ గంగాధరం, సౌత్‌జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, మేడికొండూరు సీఐ మారుతీకృష్ణ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసినట్లు అదనపు ఎస్పీ గంగాధరం వివరించారు. 

పోలీసుల అదుపులో అనుమానితులు  
దాడి దోపిడీ, లైంగిక దాడి ఘటన జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో కొత్తగా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం జరుగుతోంది. అక్కడ పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఉంటున్నారు. వీరిలో ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top