ధన‘మొక్క’టే మూలం! 

Forest Section Officer Suspension In West Godavari - Sakshi

అటవీశాఖాధికారుల అవినీతి

మొక్కలు తరలిస్తున్న లారీ స్వాధీనం

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సస్పెన్షన్‌

నర్సరీల్లో విజిలెన్స్‌ తనిఖీలు   

టి.నరసాపురం: రాజమండ్రి విజిలెన్స్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ ఏవీఎస్‌ఆర్‌కే అప్పన్న, జిల్లా సామాజిక అటవీ అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు  సోమవారం మండలంలోని టి.నరసాపురం, మల్లుకుంట గ్రామాల్లోని నర్సరీల్లో తనిఖీలు నిర్వహించారు. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు నర్సరీల నుంచి 17 వేల కొబ్బరిమొక్కలను అక్రమంగా తరలిస్తుండగా, కొందరు రైతులు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద ఆదివారం లారీని అడ్డుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన విజిలెన్స్‌ అధికారులు లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.  

సబ్సిడీ మొక్కలు కోల్‌కతాకు..  
జగనన్న హరితహారం పథకం కింద ఈ మొక్కలను రైతులకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. అయితే ఫారెస్టు అధికారులు రైతులకు సరఫరా చేయకుండా వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తే వారు ఆ మొక్కలను నేరుగా కోల్‌కతాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జీలుగుమిల్లికి చెందిన రైతు మల్లిపాటి నారాయణరావు కథనం ప్రకారం.. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం రేంజ్‌ల పరిధిలో 8 లక్షల కొబ్బరి మొక్కలను రైతులకు అందించేందుకు సామాజిక అటవీ అధికారులు ఫిబ్రవరి నుంచి వివిధ నర్సరీల్లో పెంచారు. ఈ మొక్కలను ఒక్కోటి పాలకొల్లు సమీపంలోని అడవిపాలెంకు చెందిన ఒక వ్యాపారి వద్ద రూ.25కు కొని ప్రభుత్వం నుంచి మొక్కకు రూ.60 చొప్పున నిధులు డ్రా చేశారు.  మొక్కల కొనుగోలులోనే అవినీతికి పాల్పడ్డారు. నర్సరీలో పెంచిన తర్వాత ఒక్కో మొక్కను రైతుకు సబ్సిడీపై రూ.10కే అందించాల్సి ఉండగా, తిరిగి కొనుగోలు చేసిన వ్యాపారికే మొక్కను రూ.25 నుంచి రూ. 30కి విక్రయిస్తున్నారు.

ఇలా కొన్న మొక్కలను వ్యాపారి నేరుగా కోల్‌కతాకు తరలించి ఒక్కోటి రూ.60కు పైగా అమ్మి లక్షలు గడిస్తున్నారు. ఇప్పటికే 30 టన్నుల సామర్థ్యంగల 3 లారీల మొక్కలు కోల్‌కతాకు తరలిపోయాయి. ఇప్పుడు అడ్డుకున్న లారీ నాలుగోది. టీనరసాపురం నర్సరీలో 1.90 లక్షల మొక్కలు, మల్లుకుంట నర్సరీలో 1.30 లక్షల మొక్కల్లో రైతులకు పంపిణీ చేసింది నామమాత్రమే. లారీలో తరలిస్తున్న మొక్కలను పాలకొల్లు రైతులు కొన్నట్టు అధికారులు చెబుతున్నా.. నరసాపురం రేంజ్‌లో సోషల్‌ ఫారెస్ట్‌ అధికారులు పెంచిన 85 వేల కొబ్బరిమొక్కలు సిద్ధంగా ఉండగా, 10 కిలోమీటర్లలోపు ఉన్న మొక్కలను తీసుకోకుండా అక్కడి రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. ఇదంతా వ్యాపారుల, సోషల్‌ ఫారెస్ట్‌ అధికారుల మాయాజాలం. ఈ అవినీతిలో సోషల్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ విషయాన్ని  కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్టు రైతులు చెబుతున్నారు.

విచారణ చేస్తాం: ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ అప్పన్న తెలిపారు. లారీలో మొక్కలు తరలిస్తున్న అధికారులు రైతులకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని వివరించారు.  రైతుల ఆరోపణలను విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, ఆ అంశాలన్నీ పరిశీలిస్తామని, విచారణ నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలు ప్రాథమికంగా జరిగినట్లు గుర్తించి నివేదిక సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌ఓ ఎం.శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమర్పించగా, టి.నరసాపురం, మల్లుకుంట నర్సరీల ఇన్‌చార్జి, ఫారెస్టు సెక్షన్‌ అధికారి గోపీకుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు అప్పన్న తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top