‘కృష్ణా’లో గల్లంతైన ఐదుగురూ మృత్యువాత

Five Boys Missing At Krishna River Two Boys Found Lost Breath - Sakshi

పెనమలూరు/పటమట (విజయవాడ తూర్పు):  కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురూ మృత్యువాత పడ్డారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం) మరో మూడు మృతదేహాలు దొరికాయి. విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన షేక్‌ బాజీ (15), షేక్‌ హుస్సేన్‌ (15), తోట కామేష్‌ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్‌ (14), పిన్నింటి శ్రీను, షేక్‌ ఖాశిం అలీ స్నేహితులు.

బాజీ, కామేష్‌ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్‌ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్‌ చదువుతున్నారు. వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్‌ ఆడి, యనమలకుదురు పాయ నుంచి మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డుకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు నదిలో స్నానానికి దిగారు.

కొద్దిసేపటికే వారంతా మునిగిపోవటం గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్న పశువుల కాపర్లు, జాలర్లకు చెప్పటంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. 

దర్శిపేటలో విషాదఛాయలు 
ఇనకొల్లు గుణశేఖర్, తోట కామేష్‌ మృతిచెందడం, షేక్‌ హుస్సేన్, షేక్‌ బాజీ, మద్దాల బాలు గల్లంతవడంతో దర్శిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఇంకొల్లు గుణశేఖర్, దూదేకుల హుస్సేన్, మద్దాల బాలుకు తండ్రి లేకపోవటంతో వారి తల్లులే పండ్లు, పూలవ్యాపారం చేస్తూ తమ రెక్కల కష్టంపై పిల్లల్ని సాకుతున్నారు. మృతిచెందిన పిల్లల కుటుంబాలన్నీ నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top