ఉసురు తీసిన ప్రేమ 

Father saw young man with his daughter and angrily beat him to death - Sakshi

యువకుడిని చంపి, ముక్కలుగా నరికి పాతిపెట్టిన బాలిక తండ్రి 

చిత్తూరు జిల్లా పెంగరగుంటలో ఘటన 

పలమనేరు(చిత్తూరు జిల్లా): ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరించారు. పలమనేరు మండలం పెంగరగుంట కు చెందిన ఈశ్వరగౌడ్‌ కుమారుడు ధనశేఖర్‌ (23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్‌ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై అతని తండ్రి ఈనెల 26న స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఆఖరి కాల్‌ను ట్రేస్‌ చేసి పెం గరగుంటకు చెందిన బాబును విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బాబు కుమార్తె (16), ధనశేఖర్‌ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  

బాలిక 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఫోన్‌ చేయడంతో అతను బాలిక ఇంటికి వెళ్లాడు. పొలంవద్దకు వెళ్లిన బాబు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి వసారాలో పడుకున్నాడు. ఇంట్లోని ఓ గది నుంచి మాట లు వినిపించడంతో వెళ్లి చూడగా తన కుమార్తెతో పాటు ధనశేఖర్‌ కనిపించాడు. ఆగ్రహించిన బాబు ధనశేఖర్‌ను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గోతాంలో మూటకట్టి చిన్నకుంట సమీపంలోని ఓ బావిలో పడేసి ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల తరువాత బావివద్దకు వెళ్లి చూడగా శవం తేలి కనిపించింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొందరి సాయంతో  మృతదేహాన్ని మల్బరీ ఆకులు కత్తిరించే కట్టర్‌ సాయంతో ముక్కలు ముక్కలుగా చేసి సమీపంలోని అటవీప్రాంతంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top