కాసేపట్లో కూతురు పెళ్లి.. అంతలోనే విషాదం.. | Father Died With Heart Attack On Daughter Marriage Day In Karimnagar - Sakshi
Sakshi News home page

కాసేపట్లో కూతురు పెళ్లి.. అంతలోనే విషాదం..

Sep 4 2023 8:01 AM | Updated on Sep 4 2023 11:32 AM

Father Died With Heart Attack On Daughter Marriage Day Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కాసేపట్లో కూతురు పెళ్లి.. వివాహ తంతుకు అంతా సిద్ధమవుతుండగా.. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఎర్రల రాములు(48) కేశవపట్నంలో ట్రాక్టర్‌ మెకానిక్‌. అతనికి భార్య మంజుల, కూతుళ్లు లావణ్య, కోమల, వీణ ఉన్నారు.

పెద్దకూతురు లావణ్య వివాహం జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన సతీశ్‌తో మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10.41 గంటలకు జరగాల్సి ఉంది. బంధువులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వేకువజామున రాములుకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి మృతితో లావణ్య వివాహం ఆగిపోయింది. 

అన్న నిర్లక్ష్యంతోనే అమ్మ మరణం
బాన్సువాడ రూరల్‌: బైక్‌ను అతివేగంగా నడిపి తల్లి మరణానికి కారణమయ్యాడని సొంత అన్నపైనే ఓ చెల్లెలు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌ గ్రామానికి చెందిన బర్మల నర్సవ్వ(55)కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కాశీరాం ఉన్నారు. కాశీరాం ఆదివారం తల్లి నర్సవ్వతోపాటు భార్యను బైక్‌పై కూర్చోబెట్టుకొని పైడిమల్‌ గ్రామానికి బయలుదేరాడు. ఇబ్రహీంపేట్‌ శివారులో బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయారు.

ఈ క్రమంలో నర్సవ్వ తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. బాన్సువాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సవ్వను నిజామాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మహ్మద్‌నగర్‌లో నివసించే నర్సవ్వ కూతురు గుండ్ల సుజాత ఈ విషయమై బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అన్న అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, తల్లి మృతికి కారణమైన సోదరుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసుకున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement