మాజీ ఆర్మీ జవాన్‌ బాగోతం.. మహిళతో పరిచయం.. అది కాస్తా..

Ex Army Jawan Steals Gold In Warangal - Sakshi

సాక్షి, భూపాలపల్లి(వరంగల్‌): అతనో ఆర్మీ జవాన్‌. హత్య చేసి జైలుకు పోవడంతో ఉద్యోగం పోయింది. కట్టుకున్న భార్య విడాకులు ఇచ్చింది. దీంతో జల్సాలకు అలవాటుపడిన అతడు డబ్బు కోసం చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల భూపాలపల్లి మండలంలో రెండు చోట్ల చోరీలకు పాల్పడి మంగళవారం పోలీసులకు చిక్కాడు. నిందితుడి అరెస్ట్‌ వివరాలను భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు వివరించారు. జయశంకర్‌ భపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం రేగులగూడెం జీపీలోని చల్లపల్లికి చెందిన చల్ల మహేష్‌ 2004లో ఆర్మీలో చేరాడు. 2011లో సెలవులో వచ్చేటప్పుడు వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో కేసముద్రంకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది.

కొద్దిరోజుల తరువాత ఆ పరిచయం అక్రమ సంబంధంగా మారింది. అదే ఏడాది వారిద్దరి మధ్య గొడవ కావడంతో కేసముద్రంలోని మహిళ ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. అయితే మహేష్‌ ప్రవర్తన నచ్చక భార్య విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడడంతో చోరీలు చేయాలని భావించాడు. 2011 నుంచి చెల చెల్పూరు, గోదావరిఖని, ఎన్‌టీపీసీ, కరీంనగర్, చెన్నూరు, హన్మకొండ, రామగిరి, మంథని పట్టణాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇట్టి కేసుల్లో పలుచోట్ల పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. 2021 మార్చిలో కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల కొండంపేటలో ఒక ఇంట్లో చోరీ చేశాడు. ఆ సొత్తును వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తికి రూ. 40 వేలకు అమ్మాడు.

గత నెల జూలై 29న మధ్యాహ్నం భూపాలపల్లి మండలంలోని వెరంచపల్లిలో దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. మరుసటి రోజున ఇదే మండలంలోని కమలాపూర్‌లో ఓ ఇంట్లో చోరీ చేశాడు. దొంగిలింన నగదు, సొత్తుతో విజయవాడకు వెళ్లి బతుకుదామని మంగళవారం భూపాలపల్లి బస్టాండ్‌కు వచ్చాడు. సవచారం అందుకున్న  సీఐ ఎస్‌ వాసుదేవరావు పోలీసు సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్నట్లు ఏఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. నిందితుడి నుండి 3తులాల నెక్లెస్, జత వెండి పట్టా గొలుసులు, రూ.2,10,000 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ ఎస్‌ వాసుదేవరావు, పరిశోధనకు సహకరింన ఎస్సైలు అభినవ్, నరేష్, రైటర్‌ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు హరి, వేణు, నవీన్, జితేందర్‌లను ఏఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top