ఆ..వేదనే అంతు చూసిందా? 

Dharme Gowda Deceased Special Story In Karnataka - Sakshi

రైలు కింద పడి.. పరిషత్‌ ఉపసభాపతిధర్మేగౌడ ఆత్మహత్య 

15నాటి పరిషత్‌ రభసతో  తీవ్ర దిగులు 

సాక్షి, బెంగళూరు: సొంతూరు చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సక్కరాయపట్టణ సమీపంలో రెండురోజుల క్రితం కొత్త ఇంటి నిర్మాణానికి పూజ చేశారు. ఇంతలోనే ఏమైందో రైలు పట్టాల వద్ద విగతజీవిగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి విషాదఘట్టం సంభవించింది. విధాన పరిషత్‌ ఉప సభాపతి ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ (65) సక్కరాయపట్టణ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి పలువురు మంత్రులు, నేతలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని తదుపరి కార్యక్రమాలను పర్యవేక్షించారు. జేడీఎస్‌ నేతగా సౌమ్యుడు, వివాదరహితునిగా పేరున్న ధర్మేగౌడ మరణం నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది.  

ఆనాటి నుంచి మౌనంగా   
ఈ నెల 15వ తేదీన విధాన పరిషత్‌లో బీజేపీ– జేడీఎస్‌లు ఉమ్మడిగా ఆయనను చైర్మన్‌సీట్లో కూర్చోబెట్టగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు నానా యాగీ చేసి ధర్మేగౌడను గెంటేయడం తెలిసిందే. ఆనాటి అవమానాన్ని తలుచుకుని ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. అప్పటి నుంచి బయటకు రావడం తగ్గించారు. నేతల రాజకీయ చదరంగంలో పావుగా మారి, ఈ ఎదురుదెబ్బను దిగమింగలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

నువ్వెళ్లిపో అన్నారు: డ్రైవర్‌   
ధర్మేగౌడ కారు డ్రైవర్‌ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లమన్నారన్నారు. ఆ సమయంలో వేరే వారితో ఫోన్‌లో రైలు వచ్చే సమయాల గురించి అడిగారు, నేను కొందరిని కలవాలి, నువ్వెళ్లిపో అని చెప్పడంతో వెళ్లిపోయాను. ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకోవడం బాధాకరం అన్నారు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. పిల్లలను బాగా చూసుకో. ఇంట్లో అందరూ బాగుండాలి’ అని డెత్‌ నోట్‌లో పేర్కొన్నట్లు బీజేపీ నేత సీటీ రవి మీడియాకు తెలిపారు. సీఎం యడియూరప్ప, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ, కుమారస్వామి  తదితరులు ధర్మేగౌడ భౌతికకాయానికి నివాళులరి్పంచారు.  

మంచి నేతను కోల్పోయాం
సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్‌ ఉప సభాపతి ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కన్నీరు పెట్టారు. రాష్ట్రం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన కల్మషం లేని వ్యక్తి అన్నారు.   
డెత్‌నోట్‌ రహస్యం: సీఎం 
పోలీసులకు లభించిన డెత్‌ నోట్‌ వివరాలను బహిరంగ పరచడం సాధ్యం కాదని సీఎం యడియూరప్ప అన్నారు. ధర్మేగౌడ మరణం బాధాకరం అన్నారు.  
► ధర్మేగౌడ ఆత్మహత్య బాధాకరమని పరిషత్తు చైర్మన్‌ ప్రతాప్‌చంద్రశెట్టి అన్నారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వరహెగడే కాగేరి పేర్కొన్నారు.   
► శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడది ఆత్మహత్య కాదని, రాజకీయ హత్య అని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన మరణం వెనుక అసలు నిజాలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.   
►  ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ ఆత్మహత్య వార్త షాక్‌కు గురి చేసిందని, చాలా చింతిస్తున్నామని మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ అన్నారు.  

మొదట మెగ్గాన్‌ ఆస్పత్రికి 
శివమొగ్గ: సంఘటనాస్థలం నుంచి ధర్మేగౌడ మృతదేహాన్ని అంబులెన్స్‌లో శివమొగ్గ నగరంలోని మెగ్గాన్‌ అస్పత్రికి తరలించారు. వైద్యులు మంగళవారం ఉదయం శవపరీక్ష చేశారు. ఆ సమయంలో కలెక్టర్‌ కే.బీ.శివకుమార్, ఎస్పీ  కాంతరాజు ఉండి భద్రతను పర్యవేక్షించారు. శివమొగ్గ, చిక్కమగళూరు నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో ఆస్పత్రి ముందు బారికేడ్లను పెట్టారు. శివమొగ్గలోనే ఉన్న ఎంపీ రాఘవేంద్ర, పలువురు మంత్రులు నివాళులర్పించారు.    

పల్లె నుంచి పదవులకు వన్నె
సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్‌ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ పంచాయతీ సభ్యుని నుంచి పరిషత్తు వరకు పలు పదవులను అలంకరించారు. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సఖరాయపట్టణ సమీపంలోని సరపనహళ్లి గ్రామంలో 1955 డిసెంబరు 16వ తేదీన ధర్మేగౌడ జని్మంచారు. బీలేకళ్లహళ్లి తాలూకా పంచాయతీ సభ్యునిగా 1987లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన సతీమణి మమత కాగా, కొడుకు, కూతురు ఉన్నారు. జిల్లాస్థాయిలో పలు పదవులను అధిష్టించారు. రాష్ట్ర మార్కెట్‌ మహామండలి అధ్యక్షునిగా, రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడిగా, న్యూఢిల్లీ క్రిబ్కో డైరెక్టర్‌గా, నాఫెడ్‌ సంస్థ డైరెక్టర్‌గా పలు పదవుల్లో పనిచేశారు.   

బీరూరు నుంచి ఎమ్మెల్యేగా   
గత 2004లో జేడీఎస్‌ నుంచి బీరూర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత చిక్కమగళూరులో 2018 ఎన్నికల్లో బీజేపీ నేత సీటీ రవి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌  ప్రభుత్వ సమయంలో 2018 జూన్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top