తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్‌ | Constable assassinated his mother | Sakshi
Sakshi News home page

తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్‌

Published Fri, Nov 29 2024 5:31 AM | Last Updated on Fri, Nov 29 2024 5:31 AM

Constable assassinated his mother

చిత్తూరులో ఘటన

మద్యం మత్తులో ఘాతుకం

తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి కోమాలోకి

మృత్యువుతో పోరాడి.. కన్నుమూసిన తల్లి

చిత్తూరు అర్బన్‌: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంలో తల్లిని కాలితో తన్నడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ తల్లి... మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు...  చిత్తూరు దుర్గానగర్‌ సమీపంలోని రోసీనగర్‌లో ఉంటున్న వసంతమ్మ (63)కు ఇద్దరు కుమారులు.

భర్త పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్‌ చిత్తూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా, మరో కొడుకు జ్యోతికుమార్‌ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్‌ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రమణ్యం రెండేళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్‌లో ఆరోపణలు రావడంతో శంకర్‌ కొన్నాళ్లుగా వేకెంట్‌ రిజర్వు (ఏఆర్‌)లో ఉన్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్‌ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. 

మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సతాయించాడు. తల్లితో మాటా మాటా పెరిగి వాగ్వావాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికిలోనైన శంకర్‌.. వసంతమ్మను చావ బాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నుతూ, మొహంపై దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహతప్పిన వసంతమ్మ కిందపడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఇరుగుపొరుగువాళ్లు ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డకట్టిందని, కాలుతో తన్నడంతో పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. వసంతమ్మ రెండో కుమారుడు జ్యోతికుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తొలుత దాడి కేసు నమోదుచేసి, ఆపై హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement