Chennai Crime: రూ.28 లక్షలకు సొంతిల్లు అమ్మేసి.. భార్యను ప్లాస్టిక్‌ కవర్‌లో సీల్‌ చేసి..

Chennai woman ends life after husband loses money in online rummy - Sakshi

సాక్షి, చెన్నై : కష్టపడి కట్టుకున్న సొంతింటిని రూ.28 లక్షలకు అమ్మేసి ఆన్‌లైన్‌ రమ్మీలో తగలపెట్టాడో భర్త. ప్రశ్నించిన భార్యను హతమార్చి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో పార్శిల్‌ చేసి ఇంట్లో పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా కరోనా నాటకాన్ని రచించి ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడకు చెందిన నర్సింహరాజు(38) తిరుచ్చికి వచ్చి స్థిర పడ్డాడు. 11 ఏళ్ల క్రతం తిరుచ్చి తిరువానై కావల్‌కు చెందిన గోపినాథ్‌ కుమార్తె శివరంజనిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు సమయపురం శక్తి నగర్‌లో ఓ ఇల్లు ఉంది. కొన్ని నెలల క్రితం నర్సింహ రాజు ఈ ఇంటిని అమ్మేశాడు. తాలకుడి సాయినగర్‌లో అద్దె ఇంట్లో కుటుంబాన్ని ఉంచాడు. వీరితో నర్సింహ రాజు తల్లి వసంతకుమారి(52) కూడా ఉన్నారు. 

ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై.. 
గత ఏడాది నుంచి నర్సింహ రాజు ఆన్‌లైన్‌ రమ్మీకి బానిస అయ్యాడు. భార్య శివరంజని వారించినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో సమయపురంలోని ఇంటిని రూ. 28 లక్షలకు అమ్మి ఆటలో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న శివరంజని ఈ నెల 4వ తేదీ రాత్రి భర్తను నిలదీసింది. ఆగ్రహించిన నర్సింహరాజు భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి బెడ్‌రూంలో ఉంచాడు. మరుసటి రోజు తల్లి, పిల్లలను విజయవాడకు పంపించేశాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా తన భార్యకు కరోనా సోకిందని క్వారంటైన్‌లో ఉన్నట్లు నాటకం ఆడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తానూ ఉడాయించాడు. 

వెలుగులోకి.. 
రెండు రోజులుగా శివరంజని తన ఫోన్‌ తీయక పోవడంతో తండ్రి గోపినాథ్‌ ఆందోళన చెందాడు. నర్సింహరాజు ఫోన్‌ పనిచేయక పోవడంతో ఆందోళనకు లోనయ్యాడు. విజయవాడలోని అల్లుడి సోదరిని సంప్రదించాడు. శివరంజనికి కరోనా వచ్చినట్టు, ఇద్దరు పిల్లలు మాత్రం తన వద్ద ఉన్నట్టు ఆమె ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన గోపినాథ్‌ గురువారం రాత్రి బంధువులతో కలిసి తాలకుడి సాయినగర్‌కు వెళ్లారు. ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా దుర్వాసన రావడంతో కొల్లిడం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో బెడ్‌ కింద ప్లాస్టిక్‌ కవర్లో కప్పి ఉన్న శివరంజని మృత దేహం బయట పడింది. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు నర్సింహరాజు కోసం గాలిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top