సినీ ఫక్కీలో వ్యాపారి కిడ్నాప్‌ 

Businessman Was Kidnapped And Robbed Of Cash In West Godavari - Sakshi

రూ.1.35 లక్షల నగదు, 28 గ్రాముల

బంగారం ఆభరణాల అపహరణ 

తెల్లవార్లూ కారులో తిప్పిన దుండగులు

మరింత సొమ్ము గుంజేందుకు విశ్వయత్నాలు

గుంటూరు కాజ టోల్‌గేట్‌ వద్ద విడిచి పరారీ 

నల్లజర్ల(పశ్చిమగోదావరి): ఓ వ్యాపారిని దుండగులు కారులో కిడ్నాప్‌ చేసి అతని నుంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు అపహరించి గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ వద్ద విడిచి పరారయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూబచర్లకు చెందిన కలగర రామకృష్ణ నల్లజర్లలో సూర్య రెడీమెడ్‌ షాపు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో షాపు మూసి స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. పుల్లలపాడు వీరమ్మ చెరువు సమీపంలోకి వచ్చేసరికి అటుగా ఇన్నోవా కారులో వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ద్వారకాతిరుమలకు ఎటువెళ్లాలంటూ అతనిని అడిగారు. రామకృష్ణ సమాధానం చెప్పేలోపే అతని స్కూటీని వారిలో ఒక వ్యక్తి లాక్కోగా, మరో ముగ్గురు అతని నోరునొక్కి కారులోకి బలవంతంగా ఎక్కించారు. (చదవండి: వీడిన మిస్టరీ: ఒంటరి మహిళపై కన్నేసి..

వ్యాపారి బ్యాగులో ఉన్న రూ.1 లక్షా 35 వేల నగదు, 28 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్, మూడు ఏటీఎం కార్డులు లాక్కున్నారు. పిన్‌ నంబర్‌ కూడా తెలుసుకున్నారు. కారు వెళుతుండగానే ఈ తతంగం అంతా జరిగింది. ముగ్గురు కారులో ఉండగా, మరోక వ్యక్తి రామకృష్ణ స్కూటీపై వెనక అనుసరించాడు. గుండుగొలను జంక్షన్‌లో మరో ఇద్దరిని కారులో ఎక్కించుకున్నారు. దూబచర్ల, కైకరం, భీమడోలు చుట్టూ మూడు సార్లు తిప్పారు. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించడమే కాక రాడ్డుతో కొట్టడంతో రామకృష్ణ ముఖంపై గాయమైంది. (చదవండి: ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..)

దారిలో ఓచోట ఏటీఎం వద్ద ఆగి రామకృష్ణ ఖాతాలో ఎంత సొమ్ము ఉందో పరిశీలించారు. చివరిగా తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో గుంటూరు జిల్లా కాజ టోల్‌గేట్‌ సమీపంలో కారు ఆపి రామకృష్ణకు రూ.500 ఇచ్చి ‘ఇంటికి పో.. పోలీసు కేసు పెట్టినా, ఎవరికైనా చెప్పినా చంపేస్తాం’ అని బెదిరించి గుర్తు తెలియని దుండగులు పరారయ్యారు. రామకృష్ణ అక్కడ ఒక వ్యక్తి సెల్‌ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు గుంటూరు వెళ్లి రామకృష్ణను ఇంటికి తీసుకువెళ్లారు. గురువారం ఉదయం నల్లజర్ల పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం రామకృష్ణ ఏటీఎం కార్డు నుంచి ఒంగోలులో దుస్తులు కొనుగోలు చేసినట్లు అతని సెల్‌ఫోన్‌కు సమాచారం రావడంతో ఈ దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top