రూ.7వేల అప్పు.. మనిషి ఉసురు తీసింది

Bowenpally: 7 Thousand Rupees Debt Ends Man Life - Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌: ఏడు వేల రపాయల బాకీ ఓ వ్యక్తి ఉసురు తీసింది. ఫైనాన్స్‌ డబ్బుల వసూలుకు వచ్చిన, వడ్డీ వ్యాపారి హత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డి పేట్‌కు చెందిన గంగారామ్‌ (44 ) బోయిన్‌పల్లి చిన్నతోకట్టాలో ఒంటరిగా నివాసముంటూ బోన్‌సెట్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న గంగారమ్‌ తాను అద్దెకు ఉండే ఇంటి ఆవరణలో పడిపోయి ఉండగా స్థానికుల సమాచారం మేరకు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మృతుడి గొంతుపై చేతులతో నులిమినట్లు గాయాలు ఉండటంతో అనువనాస్పద మృతి కేసు నమోదు చేశారు. గంగారాం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులు సాయిరాం, కమల్‌కిశోర్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. గంగారాం స్థానిక పాల వ్యాపారి గడ్డం సాయిరాం వద్ద తన ద్విచక్ర వాహనం తనఖా పెట్టి రూ.10వేలు అప్పుగా తీసుకున్నాడు.

గత నెలలో రూ. 3వేలు చెల్లిం, మిగతా మొత్తం త్వరలోనే ఇస్తానని ద్విచక్ర వాహనాన్ని విడిపించుకున్నారు. ఈ క్రమంలో మిగతా సొమ్ము వసూలు కోసం సాయిరాం, గంగారాం ఇంటికెళ్లి తలుపుకొట్టగా ఎంతకీ బయటికి రాలేదు. దీంతో సంజీవయ్యనగర్‌కు చెందిన పెయింటర్‌ కమల్‌ కుమార్‌ను వెంటబెట్టుకుని మళ్లీ గంగారాం ఇంటికెళ్లి నిలదీశాడు. అప్పు చెల్లించే విషయంలో వాగ్వాదం మొదలైంది. నిందితులు ఇద్దరూ గంగారాం గొంతు నులిమి పట్టుకోవడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నిందితులు గంగారాంకు చెందిన ల్యాప్‌ట్యాప్, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పారిపోయారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top