Krishna District Crime News: Black Magic Gang Arrested In Krishna District - Sakshi
Sakshi News home page

క్షుద్ర పూజల పేరిట నిలువు దోపిడీ

Published Fri, Jun 11 2021 9:53 AM

Black Magic Gang Arrested In Krishna District - Sakshi

గూడూరు(పెడన)/కృష్ణా జిల్లా: క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి నిలువునా దోపిడీకి పాల్పడుతున్న ముఠా గుట్టును గూడూరు పోలీసులు రట్టు చేశారు. బందరు రూరల్‌ సీఐ ఎన్‌.కొండయ్య వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరులోని శారదానగర్‌ కాలనీలో నివాసం ఉండే వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతిలు క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడూరు మండలానికి చెందిన యువతికి ఎవరో తాంత్రిక పూజలు జరిపారని,  క్షుద్రపూజలు నిర్వహించి ఆమెకు నయం చేస్తామని నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన బాధితురాలి తల్లిదండ్రులు యువతికి పూజలు నిర్వహించడానికి అంగీకరించారు.

దీంతో యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి  పూజలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. అప్పటి నుంచి యువతి అర్ధనగ్న  వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరిస్తూ బాధితుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ అందినకాడికి గుంజుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు మెయిల్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన గూడూరు ఎస్సై సిహెచ్‌.కె.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేశారు.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి పట్టుకున్నట్లు సీఐ కొండయ్య వెల్లడించారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసిన గూడూరు పోలీసులను సీఐ అభినందించారు.  క్షుద్ర పూజల పేరిట ఎవరైనా మాయమాటలు చెప్పడానికి ప్రయత్నిస్తే నమ్మవద్దని సీఐ హితువు పలికారు. కార్యక్రమంలో ఎస్సై దుర్గాప్రసాద్‌సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: ‘నేను నపుంసకుడిని.. తొలి రేయిలోనే భార్యకు షాక్‌’      
విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్‌!

Advertisement
Advertisement