సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్‌ చూసి ఏం చేశారంటే..

Attempt To ATM Theft By Watching YouTube In Chittoor District - Sakshi

పలమనేరు(చిత్తూరు జిల్లా): యూట్యూబ్‌లో చూసి ఏటీఎంలలో డబ్బు చోరీ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి(41), పొలకల నరేష్‌(29), మాధవరెడ్డి (25), గుడుపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి(21) తిరుపతిలో ఉంటూ స్నేహితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు.  ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్‌ చూసి తెలుసుకున్నారు.

చదవండి: మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది

అనంతరం చెన్నై వెళ్లి పరికరాలను కొనుగోలు చేశారు. ఎట్టేరిలో రిహార్సల్స్‌ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాళెం ఏటీఎంలో చోరీకి యత్నించారు. సైరన్‌ శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటి రోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయతి్నంచారు. సైరన్‌ రాకుండా చూసుకున్నారు. ఏటీఎంలో రహస్యంగా అమర్చిన చిప్, మైక్రో కెమెరా ద్వారా సమాచారం ముంబయిలోని ఎస్‌బీఐ కార్యాలయానికి చేరింది. అధికారులు ఏటీఎం లొకేషన్‌ ఆధారంగా పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లేలోపు అక్కడినుంచి ఉడాయించారు. డీఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. వాహనాల తనిఖీతోపాటు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. దుండగులు వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న పలమనేరు సమీపంలోని గంటావూరు ప్ల్రైఓవర్‌ వద్ద పోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా కారు వేగంగా వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. వారిని సీఐ భాస్కర్, ఎస్‌ఐ నాగరాజు గురువారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారు, గ్యాస్‌ కట్టర్, పరికరాలు, గ్లౌజులను సీజ్‌ చేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న స్థానిక ఐడీ పార్టీ పోలీసులు శ్రీనివాసులు, అల్లాఉద్దీన్, ప్రకాష్, శశి, ప్రభాకర్, బాలాజీకి డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top