చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని..

Assassination attempt to get married in love - Sakshi

ప్రేమించి పెళ్లి చేసుకున్నారని హత్యాయత్నం

‘పరువు’ కోసం ఆమె బంధువుల దాష్టికం 

నోట్లో పురుగుమందు పోసిన వైనం 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం  

సీతారామపురం: నాలుగేళ్లుగా ప్రేమించుకుని.. కోటి కలలతో పెళ్లి చేసుకున్న ఆ జంటను విడదీయాలని చూశారు ఆమె పుట్టింటివాళ్లు. దాడిచేశారు. చివరకు ఆమెను చంపి అయినా తమ పరువు కాపాడుకోవాలనుకునే దుర్మార్గపు ఆలోచన చేశారు. చంపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని సింగారెడ్డిపల్లికి చెందిన పి.బాలకృష్ణ, దేవమ్మచెరువు గ్రామానికి చెందిన ఎం.అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ నెల 5న ఇంట్లోవారికి తెలియకుండా వెళ్లి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమ కుమార్తె కనిపించలేదని యువతి తల్లిదండ్రులు సీతారామపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. వాళ్లిద్దరూ ఆళ్లగడ్డలో బంధువుల వద్ద ఉన్నారని తెలుసుకున్నారు. ఎస్సై రవీంద్రనాయక్‌ సిబ్బందితో కలిసి వెళ్లి వారిద్దరినీ మంగళవారం సీతారామపురం తీసుకొచ్చి తహసీల్దార్‌ వెంకటసునీల్‌ వద్ద హాజరుపరిచారు. ఇద్దరూ మేజర్లు కావడం, తన భర్తతో వెళతానని అనిత చెప్పడంతో వారిని బాలకృష్ణ ఇంటికి పంపించారు.

ఈ విషయం తెలుసుకున్న అనిత బంధువులు సంగసానిపల్లి సమీపంలో అడ్డగించి వారిపై దాడిచేశారు. బాలకృష్ణ, అనితలను కొట్టారు. ఆమె నోట్లో పురుగుమందు పోశారు. అదే సమయంలో బాలకృష్ణ బంధువులు, పోలీసులు రావడంతో పరారయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనితను 108 వాహనంలో ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయగిరి సీఐ ప్రభాకర్‌రావు వైద్యశాలలో విచారణ చేపట్టారు. అనిత బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top