అస్సాంలో అమానుషం.. క్షుద్రపూజల నెపంతో.. పట్టపగలే అందరూ చూస్తుండగా

గువాహటి/మోరిగావ్: అస్సాంలో క్షుద్రపూజలతో మహిళను హత్యచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనంచేశారు. నాగోవ్ జిల్లాలోని సమగురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సరస్సులో విగతజీవిగా పడిఉన్న 22 ఏళ్ల మహిళను 35 ఏళ్ల రంజిత్ బొర్డోలోయ్ హతమార్చాడని బోర్లాలుంగో, బర్హామ్‌పూర్ బముని ప్రాంతంలోని గ్రామసభలో ఒక బహిరంగ విచారణ చేపట్టారు.
ఆమెను రంజితే హతమార్చాడని తీర్మానించి పట్టపగలే అందరూ చూస్తుండగా సజీవదహనం చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా గ్రామంలోని పురుషులంతా పారిపోయారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. సజీవదహనం కేసులో ముగ్గురు మహిళలుసహా ఐదుగురిని అరెస్ట్‌చేసినట్లు జిల్లా ఎస్పీ లీనా డోలే చెప్పారు.