అయ్యో.. ఆనంద్‌, శోకసంద్రంలో కుటుంబం​

Anand Disease His Car Washed Away In The Sand dune At Medak District - Sakshi

సాక్షి, పటాన్‌చెరు: అమీన్‌పూర్‌ ఇసుకబావి వాగులో కొట్టుకుపోయిన కారు, ఆ కారును నడుపుతున్న ఆనంద్‌ మృతదేహం ఆదివారం లభించింది. బీరంగూడ సృజనలక్ష్మీ కాలనీకి చెందిన ఆనంద్‌ అలియాస్‌ మల్లికార్జున్‌ ఈ నెల 13న తన ఇంటికి కారులో తిరిగి వస్తూ ఇసుకబావి బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి కారుతో సహా కొట్టుకుపోయాడు. ఆ రాత్రి నుంచి అధికారుల గాలింపు చర్యలు ప్రారంభించారు. గజఈతగాళ్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్‌ సహాయంతో వెతికారు. అయినా ఏమాత్రం ఫలితం రాలేదు. వరద ఉధృతిలో కొట్టుకపోయిన తమ కుమారుడిని వెతికి పెట్టడంలో అధికారులు విఫలం చెందారని ఆనంద్‌ కుటుంబీకులు ప్రభుత్వంపై మండిపడ్డారు.

కలెక్టర్, మంత్రులు జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కారుతో సహా నీటిలో కొట్టుకుపోవడానికి లోలెవల్‌ కాజ్‌వేనే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జిల్లా యంత్రాంగం ఎంతో శ్రమించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చివరికి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కొత్తపాలెం, బలుసు తిప్పపాలెం ప్రాంతాలకు చెందిన గజ ఈతగాళ్లు ఇసుకబావి వాగులో దిగి కారును గుర్తించారు. కారును తెరిచి చూస్తే అందులోనే ఆనంద్‌ విగత జీవిగా శరీరం కుళ్లిపోయి కనిపించింది. 

వాగు పరిసరాల్లోనే పోస్టుమార్టం.. 
కారులోని ఆ భౌతికకాయానికి వాగు పరిసరాల్లోనే అధికారులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆనంద్‌కు  భార్య, ఆరేళ్ల చిన్నారి ఉంది. వారితో పాటు కుటుంబ సభ్యులు, ఆనంద్‌ తండ్రి ఆదివారం శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొన్ని రోజులుగా ఆనంద్‌ కోసం ఎదురుచూసిన ఆ కుటుంబీకులు ఆయన విగతజీవిగా ఉండటం చూసి విలపించారు. ఆనంద్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలు సహాయ సహాకారలు అందజేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆనంద్‌ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని వైసీపీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బ్రిడ్జి సరిగా లేకపోవడం కారణంగానే ఆయన ప్రమాదానికి లోనయ్యారని ఆయన వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top