పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు | Accused sentenced to life imprisonment in Pocso case | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Published Sat, Apr 10 2021 4:48 AM | Last Updated on Sat, Apr 10 2021 8:20 AM

Accused sentenced to life imprisonment in Pocso case - Sakshi

సాక్షి, గుంటూరు: ఐదేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవితకాల కఠిన కారాగారశిక్షతో సహా మూడు శిక్షలు, జరిమానాలు విధిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా, పోక్సో కోర్టు జడ్జి శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. తెలంగాణ కు చెందిన బెలిదే వేణుగోపాల్‌ గుంటూరులోని ఒక హోటల్‌లో పనులు చేస్తూ రైలుపేటలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పక్కింట్లో ఉంటున్న నేపాల్‌ దంపతుల ఐదేళ్ల కుమార్తెను వేణుగోపాల్‌ కిడ్నాప్‌ చేసి లైంగికదాడి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు 2019 డిసెంబర్‌ 18న ఐపీసీ సెక్షన్లు 363, 366, 323, 376 (ఏబీ), పోక్సో చట్టం సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేశారు.

రాష్ట్రంలో దిశ చట్టానికి రూపకల్పన జరుగుతున్న సమయంలోనే ఈ కేసు నమోదైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ సుప్రజ, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు నమోదు చేసిన అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వారంలో పూర్తిచేసి 10 రోజుల్లో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన జడ్జి.. బాలిక కిడ్నాప్, కొట్టడం, లైంగికదాడి ఇలా మూడు నేరాలకు మూడు రకాల శిక్షలను విధించారు. కిడ్నాప్‌నకు ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.500 జరిమానా, బాలికను కొట్టినందుకు ఒక సంవత్సరం సాధారణ జైలు, లైంగికదాడికి  జీవితకాల కఠిన కారాగారశిక్ష, రూ.2,500 జరిమానా విధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement