నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.కోటి టోకరా..

6 Arrested For Loan Fraud With Fake Gold In Mancherial - Sakshi

సాక్షి, నస్పూర్‌(మంచిర్యాల): నస్పూర్‌ పట్టణంలోని ఎస్‌బీఐలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.కోటి టోకరా వేసిన ముఠా గుట్టును సీసీసీ పోలీసులు రట్టు చేశారు. గురువారం సీసీసీ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ వివరాలు వెల్లడించారు. సీసీసీ నస్పూర్‌కు చెందిన రంగు అరుణ్‌కుమార్‌ బ్యాంకులో 2014 నుంచి బంగారం లోన్‌ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. అప్పుల పాలు కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని తన స్నేహితుడు బ్రహ్మనందచారి సలహా తీసుకున్నాడు. ఇతడు గతంలో మంచిర్యాలలోని ఇండియన్‌ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి లోన్‌ తీసుకున్న కేసులో ఉన్నాడు.

బ్రహ్మనందచారి సలహా మేరకు అరుణ్‌కుమార్‌ తన స్నేహితులైన బొమ్మ అన్వేష్, మంకెన లక్ష్మారెడ్డి, కొంగల లింగారెడ్డి, అమ్మ సంతోష్‌కుమార్, కాడే జీవన్‌కుమార్‌ పేరిట నకిలీ బంగారంతో రూ.1,01,36,551 రుణం తీసుకున్నాడు. బ్యాంకు మేనేజర్‌ నేహశర్మ ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్‌ సీఐ కుమారస్వామి, ఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు అరుణ్‌కుమార్‌తోపాటు బొమ్మ అన్వేష్, కొంగల లింగారెడ్డి, కాడే జీవన్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. మరో అమ్మ సంతోష్‌కుమార్, మంకెన లక్ష్మారెడ్డిలు పరారీలో ఉన్నారు. సీఐ కుమార్‌స్వామి, ఎస్సై శ్రీనివాస్‌లను ఏసీపీ అభినందించారు. 

చదవండి: పెళ్లై మూడువారాలు.. బాయ్‌ఫ్రెండ్‌ మెసెజేస్‌.. కట్‌ చేస్తే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top