ఆదుకోక వేదన.. అమ్మలా దీవెన

19 Year Old Youth Eliminates Himself In Srikakulam District - Sakshi

అటు కాఠిన్యం.. ఇటు మమకారం

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య 

చిన్నప్పుడే దూరమైన తల్లి..

రెండేళ్ల క్రితం తండ్రి కన్నుమూత

సవతి తల్లి వేధింపులే కారణమని చివరి లేఖ

గురుకుల అధ్యాపకురాలికి విద్యాలయంలో సీమంతం

సహచరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

సంప్రదాయబద్ధంగా వేడుక 

అటు చీకటి.. ఇటు వెలుగు.. అటు కాఠిన్యం.. ఇటు మమకారం. గుండె ఘనీభవిస్తే విషాదం. మనసు పరిమళిస్తే ఆనందం. ఎంత వైరుధ్యం! ఎంత విచిత్రం! కాస్త కరుణించి అనురాగాన్ని పంచితే మమత వెల్లివిరిస్తుంది. అదే గుండె బండబారితే వేదన ఉప్పెనవుతుంది. అది ఎక్కడికైనా దారితీస్తుంది. పరస్పర భిన్నమైన ఈ పరిణామాలకు శుక్రవారం సాక్షిగా నిలిచింది. సవతి తల్లి కాఠిన్యం ఓ పందొమ్మిదేళ్ల యువకుడి ఆత్మహత్యకు ప్రేరణ అయితే.. గర్భవతిగా ఉన్న అధ్యాపకురాలికి సహోద్యోగులు తామే చొరవ తీసుకుని విద్యాలయంలో సీమంతం చేయడం సంతోష కారణమైంది.

పొందూరు: మండలంలోని వీఆర్‌ గూడెం గ్రామానికి చెందిన యువకుడు పైడి నర్సింహమూర్తి(19) శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు భరించలేకే తనువు చాలిస్తున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నర్సింహమూర్తి తల్లి చిన్నప్పుడే దూరమైంది. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బాగా చదువుకోవాలనే ఉత్సాహం ఉన్నా ప్రోత్సహించే వారు లేకపోవడం, సవతి తల్లి వేధింపులు వెరసి తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఆర్‌.దేవానంద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

నా చావుకి కారణం... 
కన్నతల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో నర్సింహమూర్తి సవతి తల్లి వద్ద పెరిగాడు. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోవడంతో సవతి తల్లి వేధింపులకు గురిచేస్తోందంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. అత్తమామల దయతో పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేశానని, ఉన్నత చదువులు చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా పట్టించుకునే వారు, ప్రోత్సహించే వారు లేరని, అందుకే చనిపోతున్నానని, అత్తమామలు, బావ క్షమించాలని నోట్‌లో పేర్కొన్నాడు. (చదవండి: నేను బావిలో పడి చనిపోతున్నా..)

అమ్మలా.. దీవెన

మందస: తోటి అధ్యాపకులే బంధువులయ్యారు.. ఆశీర్వచనాలే వేదమంత్రాలయ్యాయి.. సరస్వతీ నిలయమే ఆనందవేదికయ్యింది.. మందస మండలం భైరిసారంగపురం పంచాయతీ రాధాకృష్ణపురం సమీపంలోని ఏపీ బాలయోగి గురుకులంలో ఓ అధ్యాపకురాలికి శుక్రవారం సీమంతం నిర్వహించారు. కరోనా కారణంగా గురుకులానికి దూరమైన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యారి్థనులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. చదువులమ్మ గుడిలో సందడి కనిపిస్తోంది.

ఈ తరుణంలో బోటనీ అధ్యాపకురాలు బి.ప్రమీల గర్భిణిగా ఉందని తెలుసుకున్న సిబ్బంది సంప్రదాయరీతిలో సీమంతం నిర్వహించారు. గాజులు, పసుపు, కుంకుమ, చీర, స్వీట్లు అందించి అభినందనలు తెలిపారు. ఎన్నడూలేని రీతిలో తనకు గురుకులంలో సీమంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రమీల చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శేషాద్రి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.మన్మధరావు, అధ్యాపకులు అన్నపూర్ణ, జయశ్రీ, ఎన్‌జ్యోతి, ఆర్‌.సుభాణి, యు.సంధ్యారాణి, కె.నాగమణి, వెంకటరావు, పోలయ్య, చంద్రశేఖర్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top