● కుప్పంలో జోరుగా తిరిగిన ఫ్యాన్‌ ● అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా సడలని సంకల్పం ● అన్ని మండలాల్లోనూ వరుస విజయాలతో సంబరాలు ● ఓటు ద్వారా తీర్పును ప్రపంచానికి చాటిన ప్రజలు ● పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ ఢంకా ● 2029 ఎన్నికల్లో మార్పుకు స్థాన | - | Sakshi
Sakshi News home page

● కుప్పంలో జోరుగా తిరిగిన ఫ్యాన్‌ ● అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా సడలని సంకల్పం ● అన్ని మండలాల్లోనూ వరుస విజయాలతో సంబరాలు ● ఓటు ద్వారా తీర్పును ప్రపంచానికి చాటిన ప్రజలు ● పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ ఢంకా ● 2029 ఎన్నికల్లో మార్పుకు స్థాన

Nov 27 2026 2:08 AM | Updated on Nov 27 2026 2:08 AM

● కుప్పంలో జోరుగా తిరిగిన ఫ్యాన్‌ ● అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టించినా సడలని సంకల్పం ● అన్ని మండలాల్లోనూ వరుస విజయాలతో సంబరాలు ● ఓటు ద్వారా తీర్పును ప్రపంచానికి చాటిన ప్రజలు ● పంచాయతీ ఫలితాల్లో వైఎస్సార్‌ సీపీ విజయ ఢంకా ● 2029 ఎన్నికల్లో మార్పుకు స్థానిక ఫలితాలే బీజం

సాక్షి, చిత్తూరు: ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వలేదు. వేసిన వాళ్లను చంపేస్తామంటూ ఫోన్లలో బెదిరించారు. కొన్నిచోట్ల నామినేషన్లు వేయడానికి వచ్చిన వాళ్ల పత్రాలు చించిపడేశారు. ప్రచారానికి వెళ్లాలంటే.. ఊర్లలోకి అడుగు పెట్టనివ్వలేదు. పోలింగ్‌ జరుగుతుండగా అభ్యర్థులను పోలీసులు జీపుల్లో ఎక్కించుకుని వెళ్లారు. ఇంత జరుగుతున్నా ఎక్కడా సంకల్పం కోల్పోలేదు. ప్రజల్లో వైఎస్సార్‌ సీపీకి ఉన్న ఆదరణను.. ప్రపంచానికి తెలియచేయడానికి గట్టిగా నిలబడ్డారు. నిలబడ్డ వాళ్లకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని ప్రజలు ఓటు ద్వారా తీర్పునిచ్చేశారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మార్పు సుస్పష్టమని.. కుప్పంలో వచ్చిన స్థానిక ఫలితాలతో సంకేతాలు పంపించారు.

విజేతలు ఎవరెవరంటే..

కుప్పం నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లోనూ వైఎస్సార్‌ సీపీ బలపరచిన అభ్యర్థులు గ్రామ సర్పంచ్‌లుగా గెలుపొందారు. ఇది వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌కు సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. కుప్పంలోని ఎన్‌.కొత్తపల్లెలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి గోవిందరాజులు 133 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే గుడుపల్లె మండలంలోని చీకటిపల్లె పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి కస్తూరి 153 ఓట్లు, పొగరుపల్లెలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి సుబ్రమణ్యం 175 ఓట్లు, గుడ్లసాగరంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి వత్సలమ్మ 53 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే శాంతిపురం మండలంలోని సొన్నేగారిపల్లెలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి శ్రీరాములు 29 ఓట్లు, అనికెర పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి సురేష్‌రెడ్డి 179 ఓట్లు, దండికుప్పంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి జగదీష్‌ 89 ఓట్లు, రామకుప్పం మండలంలోని నారాయణపురం తండాలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి చక్రినాయక్‌ 76 ఓట్లు, రామకుప్పం మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థి తనుభాష 673 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఇక గెలిచిన స్థానాలను బలవంతంగా లాక్కోవడానికి అలవాటు పడిన టీడీపీ ఇక్కడున్న కోనేరుకుప్పంలో వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థికి 18 ఓట్ల ఆధిక్యం వచ్చినా, టీడీపీ గెలిచినట్లు డిక్లరేషన్‌ ఇప్పించారు. పూర్తి ఫలితాలు రాత్రి 11 గంటలకు వచ్చే అవకాశం ఉండడంతో కుప్పం నియోజకవర్గంలోని మరిన్ని పంచాయతీల్లో ఫ్యాన్‌ జోరు కనిపించే అవకాశాలున్నాయి.

ఉరకలేసే ఉత్సాహం..

మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఆశించిన సీట్లు గెలవలేకపోవచ్చు. కానీ ఏకంగా 1.30 లక్షల ప్రజా ఓట్లను సాధించింది. ఇక ప్రాదేశిక పోరులో.. మొత్తం 6,86,762 ఓట్లు పోలైతే.. ఇందులో టీడీపీకి 3,45,873 ఓట్లు పడ్డాయి. వైఎస్సార్‌ సీపీకి 2,85,704 ఓట్లు వచ్చాయి. అంటే 60,169 ఓట్లు మాత్రమే టీడీపీ ఆధిక్యం సాధించింది. కుట్రలు–కుతంత్రాలు.. గూండాగిరి–రౌడీయిజం మధ్య నాలుగు జెడ్పీటీసీలతో పాటు మూడు మండలాధ్యక్ష స్థానాలను వైఎస్సార్‌ సీపీ గెలుకున్న విషయం తెలిసిందే. ఇవి అంకెలు కావు 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం ఎలా ఉంటుందో ముందే చెబుతున్న ఓ శ్యాంపిల్‌. చంద్రబాబు నాయుడు రాజకీయ పతనం కుప్పంలో ఫ్యాన్‌ సృష్టించిన సునామీ నుంచి ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ సైతం ఇదే ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయడానికి ఉరకలేస్తోంది.

దిమ్మతిరిగే విజయం

జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలు జరిగిన తీరు చూసి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయింది. ఎక్కడా లేనివిధంగా చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోకనే 51 ఏకగ్రీవాలు చేసేశారు. నగరిలో చైర్మన్‌ను దొడ్డిదారిన ఏకగ్రీవంగా గెచినట్లు ప్రకటించారు. కుప్పంలో ఏకంగా చైర్మన్‌ అభ్యర్థినే కిడ్నాప్‌ చేశారు. ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే నడిరోడ్డుపై కాపుగాచి గూండాగిరి చేశారు. తలలు పగులగొట్టి రక్తం కళ్ల చూశారు. చిత్తూరు, గంగాధరనెల్లూరుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊర్లలోనే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి, ప్రత్యర్థులను మట్టికరిపించారు. పంచాయతీ పోరులోనూ ఇదే ఫార్మలా పాటించిన తమ్ముళ్లు, వాళ్ల అరాచకాలను కుప్పం నుంచే ప్రారంభించి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దాడులకు తెగబడి, రక్తం రుచిచూశారు. అయినా సరే ఎక్కడా కూడా పార్టీ కార్యకర్తలు తగ్గలేదు. ధైర్యంగా నామినేషన్లు వేసి, ఎన్ని బెదిరింపులు వచ్చినా పోటీలో నిలబడ్డారు. చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా కుప్పంలో ఫ్యాన్‌ సునామీ సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement