35 నామినేషన్ల అప్పీళ్ల విచారణలో అధికారుల దాగుడుమూతలు
ఆమోదమో, తిరస్కరణో చెప్పకుండా దాటవేత
అధికార పార్టీ ఒత్తిళ్లకు తల్లొగ్గారా?
సర్పంచ్ అభ్యర్థులను అంధకారంలో ఉంచుతూ అధికారుల వింతపోకడ
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో గురువారం జరిగిన సర్పంచ్ నామినేషన్ల అప్పీళ్ల విచారణ రహస్య నాటకాన్ని తలపించింది. గంగాధరనెల్లూరు, చిత్తూరు, గుడిపాల మండలాల పరిధిలో తిరస్కరణకు గురైన 35 సర్పంచ్ నామినేషన్లకు సంబంధించి ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో విచారణ చేపట్టారు. విచారణ ముగిసిన తర్వాత ఆ 35 నామినేషన్లను ఆమోదించారా, తిరస్కరించారా అనే కనీస సమాచారాన్ని సైతం అధికారులు బయటకు వెల్లడించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
అధికారుల దాగుడుమూతలు
విచారణ అనంతరం ఉత్తర్వుల వివరాలను అనుకూలమైన అభ్యర్థులకు వెల్లడించి, మరికొంత మందికి వెల్లడించకుండా అలసత్వం వహించారు. మీడియాకు సైతం వివరాలు తెలపకుండా అప్పీళ్ల ఉత్తర్వులను నేరుగా ఆయా మండలాల రిటర్నింగ్ అధికారులకు (ఆర్వోలకు) పంపించేశాం అంటూ అధికారులు దాటవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం అప్పీళ్లపై తీసుకున్న నిర్ణయాన్ని పారదర్శకంగా వెల్లడించాల్సి ఉండగా, గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీవో అధికారుల తీరుపై పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
అభ్యర్థుల ఆందోళన
ఉదయం నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన అభ్యర్థులు, న్యాయవాదులకు కనీస స్పష్టత ఇవ్వకుండా అధికారులు చేతులెత్తేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉన్న నేపథ్యంలో, అసలు తమ నామినేషన్ ఆమోదం పొందిందో లేదో తెలియక అభ్యర్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా చక్రం తిప్పేందుకే అధికారులు ఈ అప్పీళ్ల డ్రామా ఆడుతున్నారని, తద్వారా ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేస్తున్నారని పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.


