ఫలితాలు తారుమారుచేసేందుకు టీడీపీ నేతల కుట్రలు ఓట్లు లెక్కిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేత కరెంట్ వచ్చే లోపు కట్టల మార్పు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచినా.. టీడీపీ వారికి డిక్లరేషన్ న్యాయం కోరితే పోలీసుల లాఠీ చార్జి
శాంతిపురం: ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంతో ప్రజల తీర్పును అపహాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులను కాదని తమ వారికి సర్పంచ్ డిక్లరేషన్లు ఇప్పించుకున్నారు. కర్లగట్ట పంచాయతీ ఓట్ల లెక్కింపు మధ్యలో కరెంటు ఆపించి, తమ వారిని బయటకు పంపి మళ్లీ కరెంటు వచ్చే లోపు తమ ఓట్ల కట్టలను తారుమారు చేశారని స్థానిక వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ మోసాన్ని ఆపాలంటూ స్థానికులతో కలిసి కర్లగట్టలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలని కోరిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించి వెళ్లగొట్టారు. కోనేరుకుప్పంలో ఓట్ల లెక్కింపులో తమకు ఆధిక్యత వచ్చినా టీడీపీ మద్దతుదారు గెలిచారని డిక్లరేషన్ ఇచ్చారంటూ అక్కడ స్థానికులు నిరసనకు దిగారు. పోలీసులు, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల బెదిరింపులను లెక్కచేయకుండా తిరగబడ్డారు. వీరిని కూడా బలవంతంగా వెల్లగొట్టారు. గుండిశెట్టిపల్లిలో ఏర్పాటు చేసిన సొన్నేగానిపల్లి పంచాయతీ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యత వచ్చినా గంట పాటు నాన్చుతూ కుట్రలకు తెరతీశారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం ముందు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఓడిపోయిన వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేస్తే రోడ్డుపైనే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటామని మహిళలు హెచ్చరించారు. దీంతో ఎట్టకేలకు ఇక్కడ వైఎస్సార్ సీపీ మద్దతుదారు గెలిచినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. ఎం కె పురంలో పార్టీ మద్దతుదారుకు మెజారిటీ ఓట్లు రావడంతో గొడవకు దిగిన టీడీపీ నాయకులు దాదాపు 3 గంటల పాటు డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. కౌంటింగ్ కేంద్రం బయట పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు పోగుకావడంతో ఎట్టకేలకు అధికారులు వైఎస్సార్ సీపీ మద్దతుదారుకు డిక్లరేషన్ ఇచ్చారు. మరో వైపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుల్లెట్ దండపాణిని పోలీసులు కడపల్లిలో అరెస్టు చేశారు. గుంజార్లపల్లిలో పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మి భర్త మల్లికార్జునరెడ్డిని అదుపులోకి తీసుకుని తరలించే ప్రయత్నం చేయగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు కారుకు అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. ఏ తప్పూ చేయకున్నా ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీయడంతో పోలీసులు ఆయనను వదిలిపెట్టారు.
ఓఎన్ కొత్తూరులో నాలుగుసార్లు రీకౌంటింగ్
గుడుపల్లె మండలం ఓఎన్ కొత్తూరులో 48 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కృష్ణవేణి గెలుపొందారని మొదట అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికలు తారుమారు చేసేందుకు టీడీపీ నాయకులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఆ విధంగా బెదిరించి, భయపెట్టి నాలుగుసార్లు రీకౌంటింగ్ చేశారు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, చంద్రబాబు పీఏ శ్రీకాంత్ అర్ధరాత్రి వేళ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పోలింగ్ కేంద్రాన్ని మూసివేసి మంతనాలు చేశారు. అయినప్పటికీ చివరకు 7 ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కృష్ణవేణి గెలుపొందారు.


