నత్తలపై నీళ్లా..? | - | Sakshi
Sakshi News home page

నత్తలపై నీళ్లా..?

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

రెండేళ్లలో పూర్తిచేస్తామని

నాటి ఎన్నికల్లో హామీ

28 నెలలుగా సాగదీస్తున్న పైపులైను పనులు

పూర్తికాని ప్లాంటు.. ఎత్తిపోతల బావి పనులు

కార్పొరేషన్‌కు భారంగా మారిన

నెలవారీ కంతులు

●

తాగునీటికి విలవిల

– పలమనేరులో నాలుగురోజులైనా

మంచినీరు రాదే

పలమనేరు: పలమనేరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ముంచుకొస్తోంది. పట్ణంలోని చాలా వార్డుల్లో నాలుగురోజుకోసారి మంచినీటి సరఫ రా లేదు. కొన్ని వార్డుల్లో మాత్రం మున్సిపల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నా అదీ చాలీచాలకనే ఉంది. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటికి కొనుక్కోవడం కష్టంగా ఉందని పట్టణంలోని నీటి సమస్య ఉన్న వార్డుల్లోని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి ప్రధానంగా నీటి సరఫరా అవుతున్న వైఎస్సార్‌ జలాశయంలో నీరు లేనందన పంపింగ్‌ ఆగిపోయింది. దీంతో బోర్ల ద్వారానే పట్టణానికి మంచినీటి సరఫరా సాగుతోంది. సరిపడా నీరంద పట్టణవాసు లు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారులేమో ఎన్నికల బిజీలో ఉంటూ ప్రజల నీటి కష్టాలను విస్మరించారనే మాట వినిపిస్తోంది.

మంచినీరు కొనాల్సిందే: పట్టణంలో వాటర్‌ క్యాన్‌లో నీళ్లు నింపేందుకు రూ.20 వసూలు చేస్తున్నారు. ఇక ట్యాంకర్‌ కావాలంటే రూ.1500 ఇవ్వాల్సిందే. డబ్బులున్న వారు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నారు. పేదలు మాత్రం మంచినీరు ఎప్పుడొస్తుందో అని మున్సిపల్‌ ట్యాప్‌లను చూస్తూ గడపాల్సిందే.

ప్రాణం పోతోంది. గొంతులో నీళ్లు పోయ్యండయ్యా అని అడిగితే.. ప్రాణం పోయాక పోస్తామన్నాడంట ఒకడు..! చిత్తూరు నగర ప్రజల కన్నీటి కష్టాలు కూడా ఇలాగే ఉన్నాయి. ప్రజలకు శాశ్వత తాగునీటి కష్టాలను తీర్చడానికి నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి చిత్తూరుకు తెలుగు గంగ నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుకు ప్రాణం పోస్తే.. గత 28 నెలలుగా కూటమి ప్రభుత్వం దీన్ని సాగదీస్తూనే ఉంది. జిల్లాలోని మున్సిపాలీటీల్లో కూడా తాగునీటికి జనం అవస్థలు పడుతున్నారు.

సాక్షి, చిత్తూరు: అడవిపల్లె నుంచి మంచినీటిని తీసుకొచ్చి ప్రజలకు అందించడం చిత్తూరు నగర వాసుల కలల ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 దాటుతున్నా ఈ పనులు నత్తలతో పోటీపడుతున్నాయి. జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే ఆరుసార్లు వచ్చిన చంద్రబాబు నాయుడు.. మరో ఆర్నెళ్లల్లో చిత్తూరుకు తెలుగుగంగ నీటిని అందిస్తామని వాగ్దానం చేసి వెళ్లిపోతున్నారు. కానీ క్షేత్రస్థా యి పనులను పట్టించుకునే దిక్కులేకుండాపోయింది.

అంచనాలు పెరిగిపోయి..

చిత్తూరు నగరానికి తొలుత ఒక టీఎంసీ తెలుగు గంగ నీటిని ఇవ్వడానికి అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రతిపాదన 2018లో మొదలయ్యింది. అన్నమయ్య జిల్లాలో ఉన్న కెవి.పల్లె మండలంలో అడవిపల్లె రిజర్వాయర్‌ ఉంది. ఇక్కడ 18 టీఎంసీ నీళ్లను ఒడిసిపట్టొచ్చు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తయితేనే అడవిపల్లెకు తెలుగు గంగ నుంచి నీళ్లు వచ్చి చేరుతాయి. ఈ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి చిత్తూరు నగరానికి నీళ్లు తీసుకురావాలనే లక్ష్యంలో రూ.250 కోట్లతో ఉన్న అంచనాలు ప్రస్తుతం దాదాపు రూ.271 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.62.29 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.24.51 కోట్లు, చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ వాటాగా రూ.184 కోట్లు ఉంది. ఇందులో కేంద్రం అమృత్‌ 1.0 కింద రూ.46 కోట్లు విడుదల చేయగా, 2.0 కింద రూ.30 కోట్లు విడుదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్ర వాటాగా రూ.18 కోట్లు విడుదల చేసింది. ఇది కాకుండా చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.104.22 కోట్లు అప్పు చేయగా, రూ.62 కోట్లు 14వ ఆర్థిక సంఘ నిధుల నుంచి భరించింది. అయినాసరే అడవిపల్లె రిజర్వాయర్‌ పనులు పూర్తికాలేదు.

పనులు పట్టించుకునేవాళ్లు ఎక్కడ..?

92 కి.మీ దూరం పనులు చేయాల్సిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 75 కి.మీ వరకు పనులు పూర్తయ్యాయినట్లు అధికారులు చెబుతున్నా.. 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. పైపులైను పనులు ప్రస్తుతం చిత్తూరు సమీపంలోని పెనుమూరు క్రాస్‌ వద్ద ఆగిపోయింది. పూతలపట్టు సమీపంలోని రంగంపేట కూడలి, పీలేరు ప్రాంతాల్లో జాతీయ రహదారిపై రోడ్డును కట్‌ చేసి అందులో పైపులు పెట్టాల్సిన పనులు కదల్లేదు. దామలచెరువు సమీపంలోని పుదిపట్లబైలు సమీపంలో 37 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు అర్దాంతరంగా ఆగిపోయాయి. రిజర్వాయ్‌ లోపల ఇన్‌టేక్‌ వెల్‌ (ఎత్తిపోతల బావి) పనులు పూర్తికాలేదు. చిత్తూరు నగరంలోని కై లాశపురం వద్ద 16 లక్షల లీటర్ల నిల్వ చేసే ట్యాంకు నిర్మించాల్సి ఉంది. నగరంలో 60 కి.మీ వరకు పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులు ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు.

కార్పొరేషన్‌ ఖజానాపై భారం

అడవిపల్లె ప్రాజెక్టు పనులను జూన్‌లోపు పూర్తిచేస్తామని ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ఏడాది సైతం ఇలాగే చెప్పారు. కానీ పనులు మాత్రం పూర్తికాలేదు. ఎప్పుడవుతాయో కూడా స్పష్టతలేదు. ఇక ప్రతినెలా బ్యాంకుకు రూ.1.15 కోట్ల నెలవారీ వాయిదాలు చెల్లించడం చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌కు గుదిబండగా మారింది. ఓ దశలో ఈఎంఐలు చెల్లించడానికి కార్పొరేషన్‌ వద్ద పైసల్లేక ఖజానా ఖాళీ అయిపోతోంది. ఇంత జరుగుతున్నా ఓ ఒక్క రోజూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దీనిపై సమీక్షగానీ.. పనులవైపు కన్నెత్తి కూడా చూడకపోవడం కొసమెరుపు.

చిత్తూరు దాహార్తిని ఎప్పుడు తీరుస్తారు..?

తాగునీటికి కటకట

నగరి : నగరి మున్సిపాలిటీలో 91,791 మంది జనాభా ఉన్నారు. వారికి దినసరి కావలసిన నీరు 9 ఎంఎల్‌డీలు. అయితే ప్రస్తుతం సరఫరా చేస్తున్నది 6 ఎంఎల్‌డీలు నీరు మాత్రమే. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పూర్తిగా ఎండిపోవడంతో 157 బోర్ల నుంచే నీటి సరఫరా చేస్తున్నారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నుంచి వచ్చే నీరు రసాయనాల ప్రభావం లేకుండా ఉండడంతో తాగడానికి వాడే వారు. ప్రస్తుతం బోర్ల నుంచి సరఫరా చేసే నీరు తాగడానికి పనికిరాదు. దీంతో తాగే నీరు రామాపురం నుంచి ట్యాంకర్లలో సరఫరా చేస్తున్నారు. ఈ ట్యాంకర్లు వార్డులో ఎప్పుడో ఒక సారి మాత్రమే కనిపిస్తుంది. పేదలున్న ప్రాంతాలకు అడపా దడపా వచ్చినా ఆ సమయానికి వారు కూలీకి వెళ్లిపోవడంతో నీరు పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీటికి జనం కటకట లాడుతున్నారు. డైయింగ్‌ యూనిట్లు బోర్లు వేసి లక్షల లీటర్ల నీరు తీసేయడంతో తాగడానికి మినహా వినియోగించుకునేందుకు బోర్లలో వచ్చే నీరు కూడా అడుగంటి పోతోంది.

తాగునీరు రావడంలేదు

నేను నగరి మున్సిపాలిటీలోని బాలాజీ గోల్డన్‌ సిటీలో నివశిస్తున్నాను. మా ప్రాంతానికి నీరు సరఫరా కావడం లేదు. ట్యాంకర్లు ఈ ప్రాంతానికి రావడం లేదు. బోర్లలో వచ్చే నీరే వినియోగించుకుంటున్నారు. అది తాగడానికి వీలుపడదు. దీంతో వాటర్‌ ప్లాంట్లకు వెళ్లి క్యాన్‌లలో నీరు తెచ్చుకుంటున్నాం. తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించాలి. – కేఏ కుమార్‌, బాలాజీ గోల్డెన్‌ సిటీ, నగరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement