బస్తీమే సవాల్‌! | - | Sakshi
Sakshi News home page

బస్తీమే సవాల్‌!

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

కొలిక్కిరాని మేయర్‌–చైర్‌పర్సన్‌

సీట్ల వ్యవహారం

వార్డుల్లో ఎవరికి ఎన్ని ఇవ్వాలో

తేల్చుకోలేని వైనం

చర్చలకు పిలవడంలేదని సైనికుల ఆగ్రహం

వికసించని కమలంగా

పక్కనపెడుతున్నారని అసహనం

జిల్లా వ్యాప్తంగా గుంబనంగా ఉన్న

అభ్యర్థుల ఎంపిక

నేటి నుంచి ‘మున్సిపోల్స్‌’కు నామినేషన్ల ఘట్టం

పురక్షేత్రంలో బరిలోకి దిగడానికి తొలి అంకం మొదలవుతోంది. శుక్రవారం నుంచి జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మునిసిపాలిటీల్లో నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు మేయర్‌–చైర్‌పర్సన్ల ఎంపికలో అధికార, మిత్రపక్ష పార్టీలు గుంబనంగా వ్యవహరిస్తున్నాయి.

సాక్షి, చిత్తూరు: కూటమి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. సీట్ల సర్దుబాటులో తమను ఏమాత్రం పట్టించుకోవడంలేదంటూ అటు జన సైనికులు, ఇటు కమలనాథులు కూడలిలో నిబడి దిక్కులు చూస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్‌ పీఠం బీసీ–జనరల్‌కు రిజర్వు కావడంతో టీడీపీలో తేనెతుట్టె కదిలించినట్లయ్యింది. మేయర్‌ సీటు ఇక్కడున్న కాజూరు బాలాజీకి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు పత్రికా సమావేశాలు పెడుతున్నారు. ఎవరికి ఇచ్చినా పర్లేదు.. సీకే కుటుంబానికి ఇవ్వకూడదని తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి, అసలు మేయర్‌ను బలిజకే ఇవ్వాలని పీపుల్‌ ఫ్రంట్‌ నేతలు, చిత్తూరు కాపు సంఘ నాయకులు రోడ్డెక్కుతున్నారు. ఎవరెన్ని చెప్పినా మేయర్‌ కుర్చీ జనసేనకు ఇచ్చే తీరుతారని సైనికులు ఆశలు పెట్టుకున్నారు. అటుకాదంటే 60 డివిజన్లలో తమకు 25 సీట్లు కేటాయించాలని పట్టుపడుతున్నారు. దీనికి విరుద్ధంగా అటు సైనికులకు, ఇటు బీజేపీ నేతలను ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి పిలిచి మాట్లాడకపోవడం విశేషం. సైనికులకు 3, బీజేపీకి ఒక సీటు ఇస్తామని.. లేకుంటే తాము ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమన్నట్లు అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.

పలమనేరులో వీడని పట్టు

పలమనేరు మునిసిపాలిటీలో కూటమి పార్టీ నుంచి కురబ–గౌడ సామాజికవర్గాలకు చెందిన దీపిక, శారద తమకే చైర్‌పర్సన్‌ సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. ఇదే సమయంలో జనరల్‌ మహిళకు రిజర్వు చేసిన చైర్‌పర్సన్‌ స్థానాన్ని 12 వేలకు పైగా ఓట్లున్న మైనారిటీలకు ఎందుకు ఇవ్వకూడదని అదే పార్టీలోని ఓ సీనియర్‌ నేత ఎమ్మెల్యేని ఇప్పటికే నిలదీసినట్లు సమాచారం.

కుప్పంలో కుమ్ములాటలు

కుప్పం మునిసిపాలిటీ ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కావడంతో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తీవ్ర వైరం జరగుతోంది. తాజా మాజీ చైర్మన్‌ సెల్వరాజ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్యేంద్ర శేఖర్‌ కత్తులు దసూస్తున్నారు. 26వేలకు పైగా ఉన్న బీసీ ఓటర్లు ఈ ఎన్నికల్లో గెలుపును నిర్దేశించనున్నారు. అయితే కూటమిలోని బహిరంగ కుమ్ములాటలను చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి నెలకొంది.

పురక్షేత్రంలో కూటమి పార్టీలో కొట్లాటలు

నగరిలో దుమారం

నగరి మునిసిపాలిటీలో చైర్మన్‌ సీటును రూ.4 కోట్లకు బేరం పెట్టారని టీడీపీ నేతలు చిత్తూరులో ప్రెస్‌మీట్‌ పెట్టడం దుమారం రేపుతోంది. ఇది ఎమ్మెల్యే అవినీతికి దాహానికి పరాకాష్టగా చెబుతున్నారు. టీడీపీ నేతలు ఎమ్మెల్యే అనుకూల వర్గం, ప్రతికూల వర్గంగా విడిపోయారు. బలిజ సామాజికవర్గం నుంచి గుణశేఖర్‌, సెంగుంద మొదలియార్‌ సామాజికవర్గం నుంచి శ్రీనివాస్‌ చైర్మన్‌ మధ్య రోజు రోజూకీ వైరం రాజుకుంటోంది. ఏ ఒక్కరికీ సీటు ఇచ్చినా, మరో వర్గం సహకరించే పరిస్థితిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement