చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాల సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిబంధనల ప్రకారం అధికారులు కొత్త సర్టిఫికెట్లు అడుగుతుండడంతో ఆశావహులు సచివాలయాలు, మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ పరుగులు తీస్తున్నారు. అయితే సర్వర్ల సమస్య, సాంకేతిక లోపాలు, దరఖాస్తుల్లో కులాలు తప్పుగా నమోదు కావడం, సుమోటోగా రావడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు కొద్ది రోజులే అవకాశం ఉండడంతో సర్టిఫికెట్లు చేతికి అందక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకుంది. సమస్యను పరిష్కరించాల్సిన ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో పోటీ అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరకాల్సి వస్తోంది.
వేధిస్తున్న సర్వర్ సమస్య
మీసేవ, సచివాలయాల్లో, తహసీల్దార్ లాగిన్లలో సాంకేతిక సమస్యలు అభ్యర్థులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న కొంత మందికి అసలు కులం కాకుండా సుమోటోగా వస్తోందని ఆరోపిస్తున్నారు. మరికొందరికి ఉన్న కులానికి బదులుగా పూర్తిగా వేరే కులం పేరుతో సర్టిఫికెట్లు వస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ తప్పులను సరిదిద్దుకునేందుకు వెళ్తుంటే సర్వర్ పనిచేయడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఎదుర్కుంటున్న సమస్యను జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. సమస్య తీవ్రతను గుర్తించి సర్వర్ సమస్యలు పునరుద్ధరించడం కానీ, అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్లతో మాన్యూవల్ పద్ధతిలో కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించడం లేదు.
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. దశాబ్దాలుగా గ్రామాల్లో, వార్డుల్లో రాజకీయంగా చక్రం తిప్పాలని భావిస్తున్న ఆశావహులు ఎన్నికల బరిలో దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ముందడుగు వేస్తున్న సమయంలో అధికారుల నిబంధనలు, సాంకేతిక లోపాలు అభ్యర్థులకు పెనుభారంగా మారాయి. నామినేషన్కు అత్యంగ కీలకమైన కులధ్రువీకరణ పత్రాలు పొందడం అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ముడుపుల దోపిడీకి తెర
నామినేషన్ల దాఖలు చేసేందుకు కేవలం కొద్ది రోజులే గడువు ఉంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. చేతిలో సమయం లేకపోవడంతో ఆశావహులు పడుతున్న ఆత్రుతను, ఆందోళనను తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, మధ్యవర్తులు ఆసరాగా మలుచుకుంటున్నారు. అత్యవసరంగా సర్టిఫికెట్ కావాలంటే ముడుపులు సమర్పించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్కొక్క సర్టిఫికెట్కు రూ.2 వేల నుంచి రూ.5 వేలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


