చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికల విధుల నిర్వహణకు ఉద్యోగుల పూర్తి వివరాలను సకాలంలో అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఉద్యోగుల సకాలంలో సేకరించి, పూర్తి సమాచారాన్ని ఎక్సెల్ షీట్లో సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ఇప్పటికే వివిధ విభాగాల సిబ్బందికి బాధ్యతలు అప్పగించినప్పటికీ, కొన్ని శాఖల నుంచి ఉద్యోగుల వివరాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఈ పని అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని స్పష్టం చేశారు.
ఎలాంటి పక్షపాతం ఉండకూడదు
ఉద్యోగుల వివరాల సేకరణలో ఎలాంటి పక్షపాతం లేకుండా, అన్ని శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన సిబ్బంది వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు, నిర్దిష్ట వైద్యపరమైన సమస్యలు కలిగిన వారు, దివ్యాంగులు, క్యాన్సర్తో బాధపడుతున్న వారు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే మినహాయింపులను పరిశీలించాలన్నారు. మినహాయింపులు కోరే సందర్భాల్లో అవసరమైన వైద్య ధ్రువపత్రాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.
నేటి నుంచే శిక్షణ
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి ఈ నెల 16, 17, 18 తేదీలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో నిర్వహించనున్న ఈ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా, నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించకపోయినా, విధులకు గైర్హాజరైనా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.


