చిత్తూరు కలెక్టరేట్ : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విశేష సేవలందించి, ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందజేసిన గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను దారుణంగా అవమానించారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో గగ్గోలు పెట్టారు. నేడు ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. అదే చంద్రబాబు ప్రస్తుతం సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ల పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చి భారీగా పంపకాలకు పూనుకున్నారు. భజన బృందానికి జనం డబ్బును వాడేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. దీనిపై అన్ని వర్గాలతో పాటు మాజీ వలంటీర్లు, నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.
హామీ నెరవేర్చాలి
ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నట్టేట ముంచేసింది. గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పి తొలగించేసింది. ఇప్పుడేమో సోషల్‌మీడియా ఇన్‌ప్ల్యూన్సర్‌లకు రూ.లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికై నా చంద్రబాబు స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించి విధుల్లోకి తీసుకోవాలి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న తీరును మార్చుకోవాలి. – నాని, మాజీ వలంటీర్, చిత్తూరు
ప్రజాధనం దుర్వినియోగం
చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. డబ్బా కొట్టించుకునేందుకు జనం డబ్బును ఖర్చు చేయడం సబబు కాదు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఖజానాలో డబ్బులు లేవని ఒక పక్క చెబుతూ.. పొగుడుతూ రీల్స్ చేసే వారికి రూ.లక్షలు మాత్రం ఎలా చెల్లించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిస్వార్థంగా గ్రామాల్లో, నగరాల్లో సేవలందించిన వలంటీర్లతోపాటు నిరుద్యోగులకు న్యాయం చేయాలి. – ప్రసాద్, నిరుద్యోగి, చిత్తూరు


