నిమజ్జనం రోజున ఏం జరిగింది..? | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనం రోజున ఏం జరిగింది..?

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

● యువకుడి మృతిపై అనుమానం.. మృతదేహం వెలికితీత ● తల్లి ఫిర్యాదుతో కదలిన యంత్రాంగం

యాదమరి: మండలంలోని గుట్టకిందఊరులో వినాయక నిమజ్జనం రోజున ఏం జరిగింది.. యాదృచ్ఛికంగా జరిగిన దాడి ఆ యువకుడి ప్రాణం బలిగొందా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కాలగర్భంలో కలిసిపోయిన ఆ యువకుడు మరణం ఇప్పుడు యాదమరి మండలంలో కలకలం రేపుతోంది. ఆరిమాకులపల్లె గ్రామానికి చెందిన ఉల్లాసబోయుడు కుమారుడు శేఖర్‌(32) మృతిపై అతడి తల్లి ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. శనివారం ఈ మేరకు ఎస్‌ఐ ఈశ్వర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగి పూడ్చిపెట్టిన శేఖర్‌ మృతదేహాన్ని వెలికితీసారు. తహసీల్దార్‌ పార్థసారథి సమక్షంలో వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించింది.

భయపడి అపస్మారకస్థితిలోకి..

పోలీసులు, స్థానికులు కథనం మేరకు.. సెప్టెంబర్‌ 16వ తేదీన గుట్టకిందఊరు గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవానికి తిరుపతిలోని ఓ హోటల్‌లో పనిచేసే శేఖర్‌ వెళ్లాడు. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భయాందోళనతో కనిపించాడు. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడి 24వ తేదీన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శేఖర్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 25న వారి సొంత పొలంలోనే మృతదేహాన్ని ఖననం చేసారు.

స్థానికుల సమాచారంతో గుట్టురట్టు

ఇదంతా అనారోగ్యంతోనే మృతి చెందాడని భావించిన తరుణంలో..గ్రామస్తుల ద్వారా అసలు విషయం శేఖర్‌ తల్లి యశోదమ్మకు తెలిసింది. నిమజ్జనం రోజు శేఖర్‌ మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం ఓ ఇంటికి వెళ్లి అక్కడి మహిళను అడిగాడు. ఆమె తన సెల్‌ఫోన్‌ను గోడపై ఉంచి అగ్గిపెట్టె ఇవ్వడానికి లోపలికి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ ఫోన్‌ కనిపొంచకపోవడంతో శేఖర్‌పై అనుమానం వచ్చి తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆమె భర్త నిమజ్జనం జరుగుతున్న చోటుకు వెళ్లి శేఖర్‌ను తనిఖీ చేయగా, సెల్‌ ఫోన్‌న్‌ కనిపించడంతో ఆవేశంతో దాడికి చేశాడు. ఈ అవమానంతో నొప్పులకు తాళలేక శేఖర్‌ ఇంటికి వచ్చేశాడు. ఆ గాయాల వల్లే తన కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లి గుండె చలించిపోయింది. తన కొడుకు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ స్పందించి యశోదమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తహసీల్దార్‌ సమక్షంలో శేఖర్‌ మృతదేహాన్ని వెలికితీసి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ ఈశ్వర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement