కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ట్రస్టుకు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గిరిధర్ రెడ్డి, రాజీవ్ కుటుంబ సభ్యులు శనివారం రూ.లక్ష నగదును విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దాతల కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు.
మద్యం దుకాణాల దరఖాస్తుకు 6 వరకు గడువు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 19 మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా ప్రొబేషన్ అధికారి శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 113 మద్యం దుకాణాల్లో, 95 దుకాణాల నిర్వాహకులు ఇప్పటికే లైసెన్సును రెన్యూవల్ చేసుకున్నారు. మిగిలిన 18 దుకాణాల రెన్యూవల్‌కు ఎవరూ ముందుకు రాకపోవడంతో 2026–27 సంవత్సరానికి లైసెన్సులు జారీ చేయడానికి ఫలితంగా చిత్తూరు కార్పొరేషన్‌లో 9, యాదమరి 1, పూతలపట్టు 2, నిండ్ర 1, వి.కోట 3, బైరెడ్డిపల్లె 1, శాంతిపురంలో ఒక దుకాణం చొప్పున.. మొత్తం 18 దుకాణాలకు, అలాగే పెద్ద పంజాణి మండలంలో కల్లుగీత సామాజిక వర్గంలోని గౌండ్లకు ఓ మద్యం దుకాణ నిర్వాహణకు ఆసక్తి ఉన్న వాళ్లు ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను ఈనెల 8వ తేదీ చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు లక్కీడిప్ ద్వారా లైసెన్సులు కేటాయిస్తామన్నారు. రూ.3 లక్షల నాన్–రీఫండబుల్ దరఖాస్తు రుసుం, అలాగే ప్రతి దుకాణానికి నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా దాఖలు కావాలనే నిబంధన పాటిస్తామన్నారు. కాగా ఇప్పటివరకు 19 దుకాణాల్లో 16 షాపులకు 45 దరఖాస్తులు పడ్డాయి.
జానపద కళారూపాలతో అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పలు ప్రాంతాల్లో జానపద కళారూపాలతో ఏపీ ఓపెన్ స్కూల్ ఉపయోగాలపై అవగాహన కల్పించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ జయప్రకాష్‌నాయుడు తెలిపారు. శనివారం నగరంలోని ఎంఎస్‌ఆర్ సర్కిల్, గిరింపేట, పలు ప్రాంతాల్లో జానపద కళారూపాలతో అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఓపెన్ స్కూల్ విద్యా విధానం, ప్రవేశాల నమోదు ప్రక్రియపై కళాబృందంతో అవగాహన కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారికి ఏపీ ఓపెన్ స్కూల్ ఒక గొప్ప అవకాశమని తెలిపారు. చదువును మధ్యలోనే నిలిపివేసిన వారు వెంటనే ఏపీ ఓపెన్ స్కూల్‌లో చేరి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు. పది, ఇంటర్మీడియట్ పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని ఏపీ ఓపెన్ స్కూల్ విభాగంలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు వెంకటాచారి, ప్రకాష్, నాగరాజు, గీత పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా స్థాయి ఘట్కా ఎంపిక పోటీలు
పుత్తూరు: స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అండర్–17 ఘట్కా (కర్ర, కత్తిసాము) ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన 130 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో 12 మంది బాలికలు, 12 మంది బాలురులతో మొత్తం 24 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సాంబశివరావు, అమ్ములు మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో ఎస్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరగనున్న 70వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 చాంపియన్‌షిప్ ఘట్కా పోటీల్లో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఎంపిక పోటీలను పాఠశాల పీడీ రేఖారాణి, గోవిందయ్య, ప్రభాకర్, సుబ్రమణ్యం, ప్రేమ్, పద్మావతి, శకుంతల, సురేంద్రరెడ్డి పర్యవేక్షించారు.


