కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం తెప్పోత్సవం నేత్రానందంగా సాగింది. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారిని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై కొలువుదీర్చారు. ఈ క్రమంలో స్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. తెప్సోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లు నిండాయి. భకుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.


